
తాజాగా ఐటీ ఉద్యోగాలు ప్రధాన నగరాల్లో దెబ్బతింటున్నాయి. సెకండ్ గ్రేడ్ నగరాలకే ఎక్కువ వెళ్తున్నాయి. దీనికి సాక్ష్యంగా పుణే, బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో గడిచిన అక్టోబరులో క్షీణత కనిపించిందని తాజా నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో ఇతర రంగాలతో పోల్చితే ఐటీ రంగాల్లో నియామకాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇదే క్రమంలో టైర్-2 నగరాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
నౌకరీ జాబ్స్ పీక్ నివేదిక ప్రకారం..గతేడాది అక్టోబరు తో పోల్చితే ఈ ఏడాది అక్టోబరు నాటికి ఐటీ రంగం ఉద్యోగాల కల్పనలో 14శాతం క్షీణత నమోదైంది. నౌకరీ డాట్ కామ్ రెస్యూమ్ డేటా బేస్ మీద ఈ నెలవారీ నివేదిక విడుదల చేసింది. కోల్ కతా తో పాటు పుణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నియామకాలు 6-11 శాతం క్షీణత ఉంటే మరోవైపు దిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రం 5శాతం వృద్ధి నమోదైంది.
ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్ లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. అంటే దక్షిణాదిలో సాఫ్ట్ వేర్ రంగానికి ఎదురుగాలి వీస్తోందనే చెప్పవచ్చు. గతేడాదితో పోల్చితే పుణే, కోల్ కతా లో నియామకాలు 6శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికొస్తే కొచ్చిలో 18శాతం, కోయం బత్తూర్ లో 7శాతం క్షీణత నమోదైంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదర లో 37శాతం, అహ్మదాబాద్ లో 22 శాతం, జైపుర్ 10శాతం వృద్ధి నమోదైంది.