పుస్తెలమ్మైనా పులస తినాలి అంటారు. ఇది గోదావరి జిల్లాల్లో నానుడి.పులసలు - గోదావరి జిల్లాలకే ప్రత్యేకం.ఆగస్ట్ , సెప్టెంబర్ నెలల్లో ఎర్రగోదావరి నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆస్ట్రేలియా లో పుట్టిన పులస చేపలు సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీదుతాయి. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు,రుచీ మారిపోతుంది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన,యానం, దవళేశ్వరం,పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం దగ్గర పులసలు దొరుకుతాయి,కేవలం ఒకే సీజన్లో అరుదుగా లభ్యం అవడం వలన,వీటికి మంచి గిరాకీ ఉంటుంది . పులసల పులుసు రుచి కూడా అమోఘం.అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస తినాలి అంటారు గోదారోళ్ళు.

 

రాబోయేది పులసల సీజన్ ప్రతి యేడాది కన్నా ఈసారి పులసలకి డిమాండ్ బాగా పెరిగిపోయింది గత సంవత్సరం చేప ఒక్కింటికి రూ.1,500 పైగా పలికిన పులస ఈసారి రూ. 2,000 వరకూ పలుకుతుంది. పులసలు రెండు రకాలు. పోతుపులస,ఆడపులస. ఆడపులస నే ' శనగ పులస ' అని కూడా అంటారు.గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా , రాజమండ్రి దగ్గర దొరికిన లస ఎక్కువ రుచిగా ఉంటుంది.

 

పులస పులుసు తయారీ విధానం : 

 

మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు.పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి.చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు , వెల్లుల్లిపాయ రేకలూ , అల్లం, జీలకర్ర, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. 

 


వెడల్పుగా , లోతు తక్కువగా ఉన్న గిన్నె ( వీలయితే మట్టి దాక ) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి. లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక , ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లి మూత ( చిల్లులున్నది ) పెట్టి మంట పెంచాలి.

 


కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు. పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి , మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది రుచీ ....ఈసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: