ఏపీలో ఇద్దరే ఇద్దరు. రెండే పార్టీలు. వారి మధ్యే భీకరమైన పోరు. వారితోనే ఏపీ పాలిటిక్స్. ఏపీలో అధికారం ఎవరిది అంటే చాలా సింపుల్. అయితే జగన్ ది. లేకపోతే చంద్రబాబుది. కాకపోతే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేదే ఇప్పుడు సస్పెన్స్. ప్రస్తుతం ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచిందని పలు విశ్లేషణలు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి ముగియగానే తమ గెలుపు ఖాయమైందని కూటమి నేతలు ప్రకటిస్తుంటే.. వైసీపీ నాయకులు మాత్రం మిన్నుకుండిపోయారు. కానీ మూడు రోజుల అనంతరం ఐ ప్యాక్ ఆఫీసుకు వచ్చిన సీఎం జగన్ ఈ సారి బలంగా కొడుతున్నాం అని గతానికి మించి సీట్లు సాధిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ వీడియోను పదే పదే చూస్తూ.. ఇంత కాన్ఫిడెంట్‌ ఏంట్రా బాబూ అని కూటమి నేతలు వణికిపోతున్నారు.


ఎందుకంటే గతంలో మాదిరిగా 151 సీట్లు వస్తాయంటే ఆ పార్టీ నాయకులే నమ్మే పరిస్థితిలో లేరు. ఎవరు గెలిచినా టఫ్ ఫైట్ ఉంటుందని.. 100 నుంచి 120 సీట్లలో బయటపడతారని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు తప్ప గత ఎన్నికల్లో మాదిరిగా ఏకపక్ష విజయం ఏదో ఒక పార్టీకి సొంతం అవుతుందని చెప్పడం లేదు. వాస్తవానికి గతంలో కూడా వైసీపీకి 151 సీట్లు వస్తాయని ఏ ఎగ్జిట్ పోల్ చెప్పలేదు. కానీ అనూహ్యంగా ఆ ఫలితాలు వెల్లడయ్యాయి. దీని మూలంగానే ఇప్పుడు జగన్ మాట్లాడిన దానిపై ఆ పార్టీ కార్యకర్తలు విశ్వాసంగా ఉన్నారు.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని జగన్ అనడం వెనుక ఆంతర్యమేంటో రాజకీయ విశ్లేషకులకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఎన్నికల్లో ఇన్ని సీట్లు కాకపోయినా అధికారానికి దూరం అయినా కూడా ఎన్నికల్లో ఏదో తేడా జరిగింది అనే ఆలోచనను ప్రజల్లో కలిగించేందుకు జగన్  ఈ వ్యూహానికి తెర లేపారు అని కొంతమంది అంటున్నారు. వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తే.. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఓటర్లు రెడీగా ఉన్నారు. ప్రత్యర్థులు కుట్రలు పన్ని తమను ఓడించారు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని అందుకే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: