యూపీ లో 2024 ఎన్నికలకు సంబంధించి చాలా మంది సిట్టింగులకు సీట్లు రాకుండా పోయాయి. అయితే ఆ జాబితా పరిశీలిస్తే యువ నేత గాంధీ కుటుంబ సభ్యుడు అయిన వరుణ్ గాంధీకి టికెట్ లేకపోవడం విస్మయం కలిగించింది. వరుణ్ గాంధీ సంజయ్ గాంధీ మేనకా గాంధీల కుమారుడు. ఇందిరా గాంధీ మనువడు. ఈ కారణం చేతనే బీజేపీ గతంలో వీరిని పార్టీలోకి చేర్చుకొని టికెట్ కేటాయించింది.


వరుణ్ గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వారసుడు. ఎంతో పొలిటికల్ లెగసీ ఉన్నవారు. ఆయన తల్లి మేనకా గాంధీ మూడు దశాబ్దాలుగా బీజేపీలో ఉంటూ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉన్నారు. వాజ్ పేయీ క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె పిలిభిత్ నుంచి మొదట్లో ప్రాతినిథ్యం వహించేవారు. కానీ ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా 1996 నుంచి మేనకా గాంధీ, వరుణ్ గాంధీల వద్ద ఉన్న పిలిఖిత్ లోక్ సభ స్థానం ఇప్పుడు జారిపోయింది.


అయితే ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సొంత పార్టీపైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. దీని ఫలితంగానే ఆయనపై బీజేపీ వేటు వేసింది. ఈ సారి ఆయన పోటీ చేసే స్థానం నుంచి జితిన్ ప్రసాద్ ను బరిలో నిలబెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఆయన కాంగ్రెస్ లో చేరితే మేం సంతోషిస్తాం. వరుణ్ విద్యావంతుడు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. మేం ఆయన్ను సాధరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.  అని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి ప్రకటించారు. దీంతో వరుణ్ కాంగ్రెస్ లో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతేడాది కేథారినాథ్ లో రాహుల్ గాంధీని కలుసుకోవడం కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: