వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు .. వైవీ సుబ్బారెడ్డి ఆ పార్టీకి ఐర‌న్ లెగ్‌గా మారిపోయారా? ఆయ‌న వ‌ల్ల పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందా? అంటే.. ఔన‌నే స‌మాధానం కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఇక‌, ఇప్పుడు వ‌క్ఫ్ బోర్డు స‌వ‌ర‌ణ బిల్లు విష‌యంలో కూడా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రింత‌గా పార్టీని ఇర‌కాటంలో ప‌డేసింది. దీంతో వైవీ సుబ్బారెడ్డిని ఐర‌న్ లెగ్ అంటూ.. నాయ‌కులు సంబోదించ‌డం గ‌మ‌నార్హం. `వైవీ వ‌ల్ల ఏం ఒరిగింది?` అంటూ కొంద‌రు నాయ‌కులు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో కూడా వ్యాఖ్యానిస్తున్నారు.


గ‌తంలో ఒంగోలు ఎంపీగా ఉన్న‌ప్పుడు.. ఇత‌ర నాయ‌కుల‌ను అణిచేశార‌న్న వాద‌న ఉంది. పైగా వెలిగొండ ప్రాజెక్టు కోసం.. పాద‌యాత్ర చేసిన‌ప్పుడు కూడా.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌ను ప‌ట్టించుకోకుండా నియం తృత్వ ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించార‌న్న వాద‌నా ఉంది. ఈ ప‌రిణామాల‌తోనే 2019లో ఆయ‌న‌కు టికెట్ లేకుండా పోయింది. ఇక‌, సొంత అయిన వాడే అయిన‌ప్ప‌టికీ.. బాలినేని శ్రీనివాస‌రెడ్డికి కంట్లో న‌లుసుగా వ్య‌వ‌హ రించి.. ఆయ‌న పార్టీ నుంచి వెళ్లిపోయే వ‌ర‌కు విశ్ర‌మించ‌లేద‌న్న వాద‌న వినిపించింది.


ఇలానే ఉత్త‌రాంధ్ర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న‌ప్పుడుకూడా.. వైవీ వ్య‌వ‌హ‌రించిన తీరు పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. పార్టీ నాయ‌కుల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన వైవీ.. విశాఖ స‌హా.. ఉత్త రాంధ్ర‌లో పార్టీ నాయ‌కుల‌కు కంట‌గింపుగా మారారు. చివ‌ర‌కు.. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించారు. అంతేకాదు.. రాజ్య‌స‌భ‌లో ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న వైవీ.. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.


వాస్త‌వానికి వ‌క్ఫ్‌కు వ్య‌తిరేకంగా ఓటేయాల‌ని.. వైసీపీ స‌భ్యులు గీత దాట‌రాద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉత్త ర్వులు ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్న వైవీ.. విప్ జారీ విష‌యంలో తాత్సారం చేశారు. దీంతో స‌భ్యులు ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. పైగా.. అంతా అయిపోయిన త‌ర్వాత‌.. తాంబూలాలిచ్చేసిన‌ట్టుగా.. వైవీ.. ఓటింగ్ అయిపోయిన త‌ర్వాత‌.. విప్ జారీ చేశార‌ని పార్టీ నాయ‌కులే చెబుతున్నారు. దీనివ‌ల్ల పార్టీకి మ‌చ్చ‌లు, మ‌ర‌క‌లు వ‌చ్చాయి. పైగా కీల‌క‌మైన మైనారిటీ ఓటు బ్యాంకుపైనా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైవీని ఐర‌న్ లెగ్ అంటూ.. నాయ‌కులు సంబోధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: