- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తనలో “సెకండ్ షేడ్” కనిపిస్తోందని, 1995లో ఉన్న కఠినమైన ముఖ్యమంత్రిగా మళ్లీ మారతానని పలు సార్లు బహిరంగంగానే చెప్పారు. కానీ, ఈ విషయాన్ని పార్టీ నాయకులంతా ఒకేలా చూడ‌లేదు. కొందరు ఆయన మాటకు విలువ ఇస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తుండగా, మరికొందరు మాత్రం తమ ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్న కొందరి వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం కలుగుతోందని చంద్రబాబు గమనించారు. అందుకే ఆయన తరచుగా వారికి వార్నింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. అయినా వారిలో మార్పు కనిపించకపోవడంతో, ఇప్పుడు ఆయన తన “సెకండ్ షేడ్”ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. గత కొన్నినెలలుగా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించిన ఆయన, అనేక దఫాలుగా వారిని వ్యక్తిగతంగా, గ్రూపులుగా కూడా హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. అయినా వారి తీరులో మార్పు లేక‌పోవ‌డంతో ఇప్పుడు నేరుగా నియోజకవర్గ నిధుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలనే నిర్ణయం తీసుకున్నారు.


ఇటీవల 16 మంది ఎమ్మెల్యేలు సీఎంవోకు వెళ్లి, తమ నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలతో 50 పేజీలకుపైగా నివేదికలను వారు స్వయంగా చంద్రబాబుకు అందించారు. తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేయడానికి నిధులు కావాలని వారు స్పష్టంగా తెలిపారు. చంద్రబాబు వీరి అభ్యర్థనను సానుకూలంగా పరిగణించినా.. ఇప్పటి వరకు ఒక్కసారైనా సీఎంవోను సంప్రదించి పనుల కోసం ప్రయత్నించని ఇతర ఎమ్మెల్యేల జాబితాను కూడా సేకరించడం ప్రారంభించారు. అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా మౌనంగా ఉన్నవారిపై చంద్రబాబు మరింత సీరియస్‌గా ఉన్నారు. “పనులు చేయాలని కోరడం తప్పుకాదు, కానీ అసలు పట్టించుకోకుండా వదిలేయడం మాత్రం సహించలేం” అనే ఆయన వైఖరి స్పష్టమవుతోంది.


అందుకే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని పనులు చేపట్టారు, ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత సొమ్ము ఇచ్చింది, ఆ నిధులను సరైన విధంగా ఖర్చు చేశారా లేదా అనేది నేరుగా అధికారుల నుంచే నివేదికల రూపంలో తెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయ‌న‌కు కొత్త కాదు.. 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇదే విధానం పాటించారు. ఆ సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపైనా, నిధుల వినియోగంపైనా జిల్లాల కలెక్టర్ల ద్వారా నేరుగా నివేదికలు తెప్పించి, పనితీరును అంచనా వేశారు. ఇప్పుడు కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖాధిపతులను కూడా ఈ సమీక్షలో భాగం చేయాలని నిర్ణయించారు. ఈ సమీక్షల ఆధారంగా, నిధుల వినియోగం సరైన విధంగా జరగని నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా 1995లో కనిపించిన కఠినమైన, క్రమశిక్షణ ఇప్పుడు చంద్రబాబు మ‌ళ్లీ చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: