ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన అంశం మళ్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న జిల్లాల కేంద్రాలు, పేర్ల మార్పులు వంటి విషయాల్లో టిడిపి లోపలే విభేదాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా అవసరమని కోరుతుండగా, పార్లమెంట్ స్థాయి నాయకులు మాత్రం ఇది రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం నియోజకవర్గం విషయంలో ఈ విభేదాలు ఎక్కువయ్యాయి. వైసిపి హయాంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. తాజాగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యే జిల్లాగా ఏర్పాటు చేస్తే స్థానిక రాజకీయ సమీకరణలు తారుమారు కావచ్చని భావించి, పార్టీకి లేఖ రాసి వ్యతిరేకత వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.


అంటే, కొత్త జిల్లా ఏర్పాటు అనేది ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం అన్న లెక్కలు టిడిపిలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ ప్రాంతంలో కూడా వివాదం ఉధృతమవుతోంది. గతంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. అయితే రాజంపేట కేంద్రంగా మార్చాలని అక్కడి నేతల వాదన. కానీ, రాజంపేటలో వైసిపి బలం ఉండటంతో, అలాగే అక్కడి ఎంపీ కూడా వైసిపి నేత కావడంతో, రాయచోటినే కొనసాగించాలని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టంగా లేఖ ఇచ్చారు. ఈ అంశంపై కూడా టిడిపి లోపల విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.


ఎన్టీఆర్ జిల్లా పేరుమార్పు విషయమూ మరో వివాదంగా మారింది. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ప్రాంతం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది. కాబట్టి కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ జిల్లాను అలాగే కొనసాగించాలని మరో వర్గం పట్టుబడుతోంది. దీనిపై విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఏలూరు జిల్లా విషయానికొస్తే దివంగ‌త వంగ‌వీటి రంగా పేరు పెట్టాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుండగా, మరో వర్గం మాత్రం ఏలూరుకు ఆ పేరు వద్దని చెబుతోంది. రంగా పేరు వేరే జిల్లాకు పెట్టుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విభేదాలు ఏలూరులోనూ చర్చకు దారితీశాయి.


ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, మంత్రి అనగాని సత్యప్రసాద్ కమిటీపై భారీ భారం పడింది. జిల్లాల కేంద్రాలు, పేర్ల మార్పులు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలపై విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో, వీటిని పరిష్కరించడం సులభం కాదని టిడిపి నేతలు అంగీకరిస్తున్నారు. ఎక్కడ లాభం, ఎక్కడ నష్టం అన్న లెక్కలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నందువల్ల జిల్లాల విభజన ముందుకు పోవడం కష్టసాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: