
కొన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే.. ప్రయోజనం శూన్యం. కదలం మెదలం అన్నట్టుగా కొందరి అధికారుల తీరు ఉంది. ఇదే పాలనా యంత్రాంగం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కూటమి ఎమ్మెల్యేలు వాపోతున్నారు. చాలా మంది ఉన్నతాధికారులు అయితే కలెక్టర్ చెబితేనే తాము పనిచేస్తామన్నట్టుగా వ్యవహరించడం, లేదంటే చూద్దాం చేద్దామంటూ కాలం గడిపేద్దాం అన్న రీతిలో ఉంటున్నారట. ఎమ్మెల్యేలు జిల్లా సమావేశాలకు వస్తున్నా... అధికారులు సమా వేశాలకు రావడం లేదు.. ఇలా చేస్తోన్న అధికారులపై చర్యలు తీసుకుంటే మళ్లీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేవి. జిల్లాల స్థాయిలో మాకెందుకులే అన్నట్టుగా వదిలేయడంతోనే ముదిరి పాకాన పడి అధికారులు ఎమ్మెల్యేలను సైతం లెక్క చేయట్లేదన్న చర్చలు జిల్లాల్లో వినిపిస్తున్నాయి.
చాలా జిల్లాల్లో జిల్లా స్థాయిలో చాలా శాఖలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యేలే ఈ విషయాన్ని తెగేసి చెబుతున్నారు. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈ తరహా వాతావరణం మరింత పెరిగిందని అంటున్నారు.
ఇక తాము చెపుతోన్న సమస్యలపై సక్రమంగా స్పందించని అధికారులపై విరుచుకుపడలేక ఎమ్మెల్యేలంతా నిస్సహాయతలో పడ్డారు. కాని అధికారంలో ఉండి తామేమీ చేయలేకపోతు న్నామన్న భావన ప్రజల్లో ముదిరితే అది తమ చేతకానితనం అవుతుందేమోనని చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆవేదనలో ఉన్నారు. కొన్ని చోట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు ఈ విషయం చెపుతున్నా వారు చెప్పినా కూడా అధికారులు లైట్ తీస్కొంటున్నారట.ఈ సిస్టమ్‌లో మార్పు రాకపోతే అంతిమంగా అది పరోక్షంగా ప్రభుత్వంపై పడి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం.