
మొదట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్‌తో సమావేశమవుతుండటం, అంతర్గత చర్చలు జరగటం చూసి, ఒకేసారి విలీనం జరగనుందనే ఊహలు గట్టిగా వినిపించాయి. కానీ చివరికి అది సాధ్యం కాలేదు. ఒక్కొక్కరిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం ప్రారంభమైంది. ఈ సంఖ్య పది మంది ఎమ్మెల్యేల దగ్గరే ఆగిపోయింది. ఎల్పీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారని అంచనా వేసినా, చివరికి అది జరగలేదు. ఈ పరిస్థితి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బలహీనంగా కనిపించేలా చేసింది. కేసీఆర్ గతంలో చేసిన పద్ధతి భిన్నం. ఆయన కొంతమందిని చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చి, ఆ తర్వాత మొత్తం కాంగ్రెస్ ఎల్పీని తన పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్‌ను బలంగా దెబ్బకొట్టారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ దమ్ముంటే బీఆర్ఎస్ ఎల్పీని కేసీఆర్‌లా కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలని.. లేనిపక్షంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అని ఆయన సవాలు చేస్తున్నారు. ఈ కారణంగా కాంగ్రెస్ ఇరుకులో పడింది. న్యాయపోరాటం తప్ప మరో మార్గం కనిపించడంలేదు.
కాంగ్రెస్ క్యాడర్ అభిప్రాయం మాత్రం సూటిగా ఉంది. ఇప్పటికైనా పోయేదేమీ లేదు. కేసీఆర్ ఎలా కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నాడో, అలాగే బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకోవాలంటున్నారు. అలా చేస్తేనే కాంగ్రెస్ పాలన స్థిరపడుతుందని భావిస్తున్నారు. అసలు సమస్య ఏమిటంటే ఇంకా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్‌లో చేరడానికి ముందుకొస్తారు అన్నది. బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులు, అలాగే భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఆ సమాధానం రానుంది. అప్పటివరకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే.