వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో బాగా అంతర్మథనంలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తన సొంత చెల్లి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలతో జ‌గ‌న్ బాగా డిస్ట‌ర్బ్ అవుతున్నారు. చంద్రబాబు చేసే విమర్శలను రాజకీయంగా ఎదుర్కొనే విష‌యంలో జ‌గ‌న్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. కానీ సొంత సోద‌రి వైఎస్‌.షర్మిల చేసిన ఆరోపణలను తిప్పికొట్టడం, లేదా వాటిని పట్టించుకోకపోవడం ఈ రెండూ కూడా జగన్‌కు రాజకీయంగా, వ్యక్తిగతంగా సమస్యలనే తెస్తున్నాయి. ఇటీవల షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కొత్త తుఫానుకు దారితీశాయి. ముఖ్యంగా “వైఎస్ వారసుడు జగన్ కాదు, నా కొడుకు రాజారెడ్డి” అన్న మాటలు వైసీపీ క్యాడర్‌లో షాక్ కలిగించాయి.


అంతేకాదు, “జగన్ తన తండ్రి గుండెల్లో కత్తి దింపాడు” అన్న విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆమె బహిరంగంగా ప్రకటించడం జగన్‌కు మరింత షాక్ ఇచ్చిన‌ట్టే అయింది. ఇప్పటి వరకు షర్మిల ఎక్కువగా గత ప్రభుత్వ నిర్ణయాలు, ఆస్తుల వ్యవహారాలు, వివేకానందరెడ్డి హత్య కేసు వంటి విషయాలపైనే దృష్టి పెట్టారు. కానీ తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో జగన్ తీసుకున్న నిర్ణయం, అలాగే వైఎస్ వారసత్వం అంశాన్ని కూడా ప్రస్తావించడం వైసీపీని బాగా డిఫెన్స్‌లోకి నెట్టేసింది. పార్టీ కీలక నేతలు కూడా ఈ దాడులను ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క‌ గందరగోళంలో ప‌డిపోయారు.


జగన్ దృష్టిలో చంద్రబాబు విమర్శలు ఎదుర్కోవడానికి సులభమే. ఆ విమర్శలను తన అనుకూల మీడియా ద్వారా తిప్పికొట్టవచ్చు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూపిస్తూ కౌంటర్ ఇవ్వవచ్చు. కానీ షర్మిల విషయంలో మాత్రం సమస్య భిన్నంగా ఉంది. ఆమె సొంత సోద‌రి కావడంతో సెంటిమెంట్ ఇబ్బంది కలిగిస్తోంది. జగన్ ఏదైనా బహిరంగంగా సమాధానం ఇస్తే, “చెల్లిని కూడా విమర్శిస్తున్నాడు” అని ప్రచారం జరుగుతుంది. ఇదే కాకుండా, విపక్ష మీడియా దీనిని పెద్ద ఎత్తున ప్రస్తావించి జగన్ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఈ పరిస్థితి జగన్‌ను వ్యక్తిగతంగా కూడా బాగా బాధ పెడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో షర్మిల చేసిన ఆరోపణలపైనా ఆయన ఇలాంటి ఆవేదన వ్యక్తం చేశారట‌. ఇక ఇప్పుడు ష‌ర్మిల వైఎస్ వారసత్వం అనే అంశాన్ని షర్మిల నేరుగా ప్రశ్నించడం, వైసీపీ స్థితిగతులపైనా అనుమానాలు రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: