ఇడ్లీ, సాంబార్ అంటే ఎవరికైన తమిళనాడు ఠక్కున గుర్తుకు వస్తుంది. కానీ ప్రస్తుతం అ మాట మారింది. ఇడ్లీ, సాంబర్‌కు ఓ బామ్మ అక్కడ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఎందుకురా.. జీవిస్తున్నావు అంటే.. సంపాదించడం కోసం అంటారు చాలామంది. కానీ ఆకలి తీర్చడంలో ఆత్మ తృప్తి ఉంది. బ్రతకడానికి మనకెంత కావాలో అంతే తీసుకోవడంలో ఆనందం ఉందంటోంది ఆ బామ్మ. అదే ఇప్పుడు ఆమెను దేశమంతా రూపాయి ఇడ్లీ బామ్మగా ముద్దుగా పిలుస్తోంది.  


వేలకోట్ల రూపాయల సంపాదన ఉండి.. కేంద్ర నుంచి నిధులు తెచ్చుకొని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటాయి. ప్రభుత్వ పధకాలు కాబట్టి నష్టం వచ్చినా ఎలాగోలా భరిస్తుంది. అయితే ఒక చిన్న హోటల్ లో టిఫిన్ చేయాలన్నా కనీసం 20 నుంచి 30 రూపాయలు అవుతుంది. గట్టిగా టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఖతం. ఎంత పల్లెటూరు కావొచ్చు.. ఇడ్లీ ధర  15 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. కానీ రూపాయితో ఓ 80 సంవత్సరాల వృద్ధురాలు నిత్యం సామాన్యుల కడుపునింపుతోంది. ఎనిమిది పదులు వయస్సులోనూ యువతరం కంటే ఉత్సాహంగా పేదల కోసం రూపాయికే ఇడ్లీ అందిస్తోంది.  


తమిళనాడులోని పెరూర్‌కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలెం గ్రామంలో నివసించే ఈ అవ్వ, తన ఇంటి తలుపులు ఉదయం ఆరు గంటలకు తెరుస్తుంది. అప్పటికే ఇడ్లీ కోసం బోలెడుమంది బయట నిలబడి ఉంటారు. అవ్వ తలుపులు తెరవగానే వారంతా ఆమెను నవ్వుతూ పలకరిస్తారు. అందరినీ ఆప్యాయంగా చూస్తూ, ఎవరెవరికి ఎన్నెన్ని కావాలో అడుగుతూ.. వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందిస్తుంది ఆ అవ్వ. ఇన్నీ కలిపి చాలా ఎక్కువ ధర అనుకుంటే పొరపాటే. ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయి మాత్రమే. కమలాత్తాళ్‌ పండు ముదుసలి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి, భగవంతుడిని మనసారా ప్రార్థించి, పొలానికి వెళ్లి, తాజా కూరగాయలు తీసుకొస్తుంది. చట్నీ తయారుచేయడం కోసం రోలు సిద్ధం చేసి, తాజా కొబ్బరి, ఉప్పు వేసి, రుచికరమైన పచ్చడి చేస్తుంది ఈ అవ్వ. సాంబారులోకి కావలసిన కూరగాయలన్నీ స్వయంగా తరిగి, మట్టితో అలికి చేసిన కట్టెల పొయ్యి మీద ఒక గిన్నెలో వేసి ఉడికిస్తుంది. అంతలోనే లోపలకు వెళ్లి ఒక చేతితో బకెట్ సాంబారు, ఒక చేతితో ఇడ్లీలు అలవోకగా తెస్తుంటే, ఈ వయసులో ఇంత వేగంగా ఎలా పనిచేయగలుగుతుందా అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. 


తమది రైతు కుటుంబమనీ.. ప్రతిరోజూ కుటుంబ సభ్యులంతా తనను ఇంట్లో వదిలి పొలానికి వెళ్లేవారని చెబుతోంది ఇడ్లీ బామ్మ. ఒంటరిగా ఉండటంతో విసుగ్గా అనిపించేదని., దీంతో ఏదో ఒక పనిచేయాలనుకున్నానని వివరిస్తోంది. ఆ చుట్టుపక్కల ఉండేవారికోసం ఇడ్లీ వేయడం ప్రారంభించానని.. ఇప్పుడు తన దగ్గరకు రోజు ఎంతోమంది కూలీలు వస్తుంటారని,   అతి తక్కువ ధరలో స్వచ్ఛమైన కల్తీ లేని ఇడ్లీలు తింటున్నామన్న ఆనందం వారికి కలుగుతుందని చెబుతోంది.


వడివేలయంపాలెంలోనే ఇంటి దగ్గరే 30 సంవత్సరాలుగా ఇడ్లీలు అమ్ముతోంది కమలాత్తాళ్‌.  చిన్నతనం నుంచి రోట్లో రుబ్బిన పప్పుతోనే ఇడ్లీలు తయారుచేయడం ఆమెకు అలవాటు. నేటికీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ పప్పు నానబెట్టి, శుభ్రంగా కడిగి, రుబ్బి మరుసటి రోజుకి సిద్ధం చేసుకుంటానని.,  ఇందుకోసం  రోజూ ఆరు కిలోల పప్పు, బియ్యం కావాల్సిఉంటుందని చెబుతోంది. రుబ్బడానికి నాలుగు గంటల సమయం పడుతుందనీ, రోజూ తాజా పిండినే ఉపయోగిస్తానని తయారీ విధానాన్ని వివరించింది ఇడ్లీ బామ్మ. 
ఇడ్లీ ధర పెంచరెందుకు? అని తనను చాలామంది అడుగుతుంటారని  బామ్మ చెబుతోంది. వారందరికీ తాను  చెప్పే  సమాధానం ఒకటేనని.,  ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపడమే తనకు పెద్ద ఆదాయమని అంటోంది. కమలాత్తాళ్‌ ఇడ్లీల విషయం వార్తల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో, ఆయా ప్రాంతాల నుంచి ఇడ్లీల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయినప్పటికీ కమలాత్తాళ్ ఇడ్లీ ధర ఒక్క పైసా కూడా పెంచలేదు. రాబోయే రోజుల్లో కూడా పెంచనని చెబుతున్నారు. తాను చనిపోయే దాకా రూపాయికే ఇడ్లీ అమ్ముతాని అంటోంది ఈ బామ్మ. 


మరింత సమాచారం తెలుసుకోండి: