చిన్న పిల్లలు ఇంట్లో ఉంటె ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. చిన్న పిల్లలు తొందరగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఇక వాళ్లు కాస్త ఆనారోగ్యం పాలయినా, నీరసించినా మనసు విలవిల్లాడిపోతుంది. వాళ్లు కోలుకుని మామూలుగా అయ్యే వరకూ ప్రాణం కొట్టుకుంటుంది. అదే పిల్లలు త్వరగా కోలుకునేలా చేయడమెలాగో తెలుకున్నారనుకోండి. హైరానా పడాల్సిన అవసరమూ ఉండదు. మన పిల్లలు ఎక్కువకాలం అనారోగ్యంగానూ ఉండరు.

ఇక పిల్లలు అనారోగ్యం పాలవ్వగానే కంగారు పడిపోకండి. ఏమీ కాలేదు, త్వరగానే తగ్గిపోతుంది అని చెప్పండి. మీరు హైరానా పడితే వాళ్లకేదో అయిపోయిందనుకుంటారు. అనారోగ్యం ఎందుకు వచ్చిందో ముందు మీరు అంచనా వేసుకోండి. తద్వారా ఏం చేయాలో డాక్టర్ ని అడిగో, నెట్ లో చూసో తెలుసుకోండి. అయితే మందులు వేసుకోవడానికి నానా యాగీ చేస్తారు పిల్లలు. అలా అని బలవంతం చేసి, ఏడిపించి వేయకండి. మందులు ఎందుకు వేసుకోవాలో వివరించండి. లేచి ఆడుకోవాలంటే అవి అవసరమని చెప్పండి. ఏ పద్ధతిలో వేస్తే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో ఆలోచించి అలా చేయండి.

అంతేకాదు.. ఆహారం విషయంలో జాగ్రత్త. పిల్లలు ఫుడ్ దగ్గర టెంప్ట్ అయిపోతారు. తినకూడనివి తినేస్తారు. కాబట్టి ఓ కన్నేసి ఉంచండి. నచ్చినట్టు ఉండనివ్వండి. టీవీ చూడటమో... పెయింటింగ్ వేయడమో... ఒళ్లు అలసిపోకుండా వాళ్లు ఏం చేస్తానన్నా చేయనివ్వండి. మైండ్ రిలాక్స్ అయితే త్వరగా కోలుకుంటారు. అనవసరమైన విషయాలు మాట్లాడకండి. నువ్వు అలా చేశావు, అందుకే ఇలా అయ్యింది అనకండి. స్కూలు పోతోంది, త్వరగా కోలుకోవాలి అంటూ ఒత్తిడి చేయకండి. ఎక్కువసేపు వాళ్లతో గడపండి. మనం చూపించే ప్రేమ అన్నిటికంటే పెద్ద మందు. కబుర్లు చెప్పండి. వాళ్లతో కలిసి ఆడి పాడి నవ్వించండి. అనారోగ్యం పాలవ్వడం వల్ల మనకి ఎంత నష్టమో, కోలుకునేవరకూ ఎన్ని మిస్సయిపోతామో వాళ్లు చక్కగా ప్రేమగా వివరించండి. దానివల్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పోయి శ్రద్ధ పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: