అధికార వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది మాత్రమే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ టాప్‌లో ఉన్నారని చెప్పొచ్చు. అలా టాప్‌లో ఉన్నవారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరని చెప్పొచ్చు. వైసీపీలో టాప్ 10 ఎమ్మెల్యేల లిస్ట్ తీస్తే..కోటంరెడ్డి అందులో ఉంటారు. ఇక నెల్లూరు జిల్లా పరంగా చూసుకుంటే కోటంరెడ్డి టాప్‌లో ఉంటారని చెప్పొచ్చు. అయితే గత రెండు పర్యాయాలుగా రూరల్ నుంచి సత్తా చాటుతూ వస్తున్న కోటంరెడ్డికి దూకుడు ఎక్కువే.

పనిలో ఎలా దూకుడుగా ఉంటారో ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో కూడా అంతే దూకుడుగా ఉండేవారు. అలాగే ప్రత్యర్ధులపై ఓ రేంజ్‌లో విమర్శలతో విరుచుకుపడతారు. అలాగే ఈయన అప్పుడు నోటికి పనిచెప్పి వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కానీ ఈ మధ్య ఏమైందో గానీ కోటంరెడ్డి పూర్తిగా మారిపోయారు. చాలా సౌమ్యంగా రాజకీయంగా చేస్తున్నారు. ప్రత్యర్ధులపై ఎక్కువ విమర్శలు చేయడం లేదు.

తన నియోజకవర్గానికే పరిమితం అవుతూ...అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కోసం పనిచేస్తున్నారు. మొన్నటివరకు నియోజకవర్గంలో కొన్ని వర్గాల ప్రజలకు కోటంరెడ్డి అంటే పడేది కాదు. ఇక ఈయన అంటే టీడీపీ మద్ధతుదారులకు బాగా కోపం ఉండేది. కానీ మొత్తం మారిపోయింది. ఆయన అందరినీ కలుపుకుని వెళుతున్నారు. అందరికీ పనూ చేసి పెడుతున్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్నారు. విమర్శల జోలికి పోకుండా, నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ, ప్రత్యర్ధి పార్టీ ఓటర్లని సైతం మెప్పిస్తున్నారు.

కోటంరెడ్డి మారి...ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అలాగే పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు, మహిళలకు కోటంరెడ్డి మద్ధతు ఇచ్చి వైసీపీలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అంటే ప్రజాభిప్రాయం మేరకే కోటంరెడ్డి నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న కోటంరెడ్డికి రూరల్‌లో తిరుగులేని బలం పెరిగిందనే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కోటంరెడ్డికి తిరుగుండదని తెలుస్తోంది. మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: