బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు బీజేపీ తనకు ఇచ్చిన హామీకి, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాలిటిక్స్ అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదని, అదొక నిరంతర యజ్ఞమని ఆమె అన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన కంగనా, రాజకీయ జీవితం తాను ఊహించిన దానికంటే చాలా కఠినంగా ఉందని అన్నారు. తనకు టికెట్ ఆఫర్ చేసినప్పుడు, ఏడాదికి 60-70 రోజులు మాత్రమే రాజకీయాలకు కేటాయిస్తే సరిపోతుందని బీజేపీ నేతలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని ఆమె వెల్లడించారు. నిజాయితీగా పనిచేసే నేతలకు రాజకీయాలు ఒక వృత్తిలా కాక, ఖరీదైన హాబీలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక ఎంపీగా తనకొచ్చే జీతం, ఖర్చుల గురించి కంగనా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎంపీగా నెలకు లక్ష నుంచి లక్షన్నర జీతం వస్తే, సిబ్బంది జీతాలు, ప్రయాణ ఖర్చులు, నియోజకవర్గ పర్యటనలకే అధిక భాగం పోతుందని, చివరకు చేతిలో రూ.50,000-60,000 మాత్రమే మిగులుతాయని తెలిపారు. తన నియోజకవర్గంలో ഒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే 300-400 కిలోమీటర్లు ప్రయాణించాలని, దీనికి లక్షల్లో ఖర్చవుతుందని అన్నారు. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ మార్గాలు లేకపోతే ఆర్థికంగా చాలా కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎంపీల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉందని కంగనా అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేయాల్సిన తాము, చాలా సందర్భాల్లో నిస్సహాయులుగా మిగిలిపోతున్నామని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యేలు, పంచాయతీలకు ఎక్కువ నిధులు, గౌరవం లభిస్తాయని, కానీ ఢిల్లీలో మంత్రులను కలవడానికి కూడా ఎంపీలకు అపాయింట్‌మెంట్‌లు దొరకవని ఆమె అన్నారు. మురుగు కాలువలు పగిలిపోయినా ప్రజలు తన దగ్గరికే వచ్చి, తన సొంత డబ్బుతో ఆ పనులు చేయాలని అడగడం తనను ఆశ్చర్యపరిచిందని ఆమె పేర్కొన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమస్య అని చెప్పినా ప్రజలు వినడం లేదని ఆమె తెలిపారు.

కంగనా దూకుడైన వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు సొంత పార్టీ అయిన బీజేపీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా రైతుల నిరసనలు, సిక్కులకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో, బీజేపీ అధిష్టానం ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. వివాదాలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం హెచ్చరించినా ఆమె తీరు మారలేదని తెలుస్తోంది. దీనికి తోడు, నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం లేదని, పార్లమెంట్ సమావేశాలకు, కోర్టు విచారణలకు గైర్హాజరవుతున్నారని ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: