కోనసీమను పాకిస్తాన్ లా మారుస్తున్నారా అంటూ మండిపడ్డారు టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోనసీమను పాకిస్తాన్ తో పోల్చి మరీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎలా ఉన్నా, ఎక్కడకు పోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని, అసలేమాత్రం పట్టడం లేదని అన్నారు వంగలపూడి అనిత. కోనసీమను చూస్తుంటే పాకిస్తాన్ గుర్తొస్తోందని చెప్పారు. ఇటీవల కోనసీమలో జరిగిన అల్లర్లకు అధికార పార్టీయే కారణం అని ఆమె మరోసారి విమర్శించారు. అల్లర్లను అదుపు చేయకపోగా.. నష్టం జరిగిన తర్వాత పోలీసులు మితిమీరిన ఆంక్షలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

జగన్ పై విమర్శలు..
ఏపీ సీఎం జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునకగా మారిపోయిందని అన్నారు వంగలపూడి అనిత. కోనసీమ అల్లర్లకు, ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారానికి మధ్య సంబంధం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికారదాహాంతో రైళ్లు తగలబెట్టిందని అన్నారు అనిత. కాపు రిజర్వేషన్లకోసం జరిగిన పోరాటంలో.. ప్రతిపక్షం వెనకుండి విధ్వంసానికి పాల్పడిందని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు పంథా మార్చుకోలేదని, ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి వైసీపీ కోనసీమ అల్లర్లతో ప్రజల్ని డైవర్ట్ చేసిందని అంటున్నారు అనిత. అమలాపురంలో సాక్షాత్తూ మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా? అని ప్రశ్నించారు అనిత.

కోనసీమ అల్లర్ల వ్యవహారంలో 65 మందిని పోలీసులు అరెస్ట్ చేస్తే 45మంది వైసీపీ వారే ఉన్నారని చెప్పారు వంగలపూడి అనిత. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో దమ్ముంటే పోటీ చేయండి అంటూ వైసీపీ నేతలు, టీడీపీకి సవాల్ విసురుతున్నారని, ఆదమ్ము వారికే ఉంటే.. తక్షణం ఏపీలో ప్రభుత్వాన్ని రద్దుచేసి తిరిగి ఎన్నికలకు రావాలని అనిల సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని చెప్పిన జగన్.. వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కూడా అనిత డిమాండ్ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో తిరిగి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు అనిత.

మరింత సమాచారం తెలుసుకోండి: