ఇంతకాలం కేసీయార్ ను పెద్దగా పట్టించుకోని ఏపీ రాజకీయపార్టీల్లో కొన్ని విరుచుకుపడుతున్నాయి. అధికార వైసీపీతో పాటు బీజేపీ  కేసీయార్ పై గట్టిగా ఎదురుదాడులు చేస్తున్నాయి. కేసీయార్ అంటే భయపడుతున్న చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ యధావిధిగా మౌనాన్నే ఆశ్రయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ పై డైరెక్టుగా మంత్రులు, వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంతకాలం అంశాలవారీగా ప్రభుత్వాన్ని  తప్ప ఏపీ మంత్రులు కేసీయార్ ను ఎప్పుడూ టార్గెట్ చేయలేదు.





అయితే తాజాపరిస్ధితుల్లో మంత్రులు, మాజీమంత్రులు నేరుగా కేసీయార్ నే ఎటాక్ చేస్తున్నారు. బీఆర్ఎస్  ఏపీ శాఖను ఏర్పాటుచేయటానికి కేసీయార్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీలోని కొందరు నేతలను బీఆర్ఎస్ లో కేసీయార్ చేర్చుకున్నారు. ఈ సందర్భంగా నోటికొచ్చిందేదో మాట్లాడేసి ఎప్పటిలాగే తప్పుడు హామీలిచ్చారు. వైజాగ్ స్టీల్స్ ను కేంద్రం ప్రైవేటుపరం చేస్తే బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే మళ్ళీ స్వాధీనం చేసుకుంటుదన్నారు. నిజంగా ఇది జరిగే పనికాదు.





ఒకవేళ కేసీయార్ గనుక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని తిరిగి వాపసు తెచ్చే అవకాశమే ఉంటే మరి తెలంగాణాలో ప్రైవేటుపరమైన ఫ్యాక్టరీలను ఎందుకని స్వాధీనం చేసుకోలేకపోయారు. చంద్రబాబునాయుడు హయాంలో తెలంగాణాలోని షుగర్ ఫ్యాక్టరీలతో పాటు మరికొన్ని ఫ్యాక్టరీలు ప్రైవేటుపరమైపోయాయి. వాటన్నింటినీ కేసీయార్ తిరిగి ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవచ్చు కదా. ఈ విషయాన్ని వదిలేస్తే ప్రత్యేక తెలంగాణా సమయంలో సీమాంధ్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఏపీ జనాలు ఇంకా మరచిపోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఏపీపైన కేసీయార్ ఎంత విషంచిమ్మారో అందరికీ తెలిసిందే.





ఇలాంటి కేసీయార్ జాతీయపార్టీ పెట్టుకుని ఏపీలో పోటీచేస్తామంటే ఎవరు ఆదరిస్తారంటు మంత్రులు, బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఏపీలో పోటీచేసేటపుడు కేసీయార్ ఏమని ఓట్లడుగుతారో చెప్పాలంటు మంత్రులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన, ఏపీ జనాలను అవమానించిన కేసీయార్ ముందు క్షమాపణలు చెప్పాలంటు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేయటం గమనార్హం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కేసీయార్ కు గట్టి వ్యతిరేకత తప్పేట్లులేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: