గురువు అంటే ఒక తత్వం
గురువు అంటే నడిచే విజ్ఞానభాండం
గురువు మన బుద్ధిలో నిద్రానమైన చైతన్య శక్తిని మేల్కొలిపే దివ్య చైతన్యం.

అటువంటి గురువుకు నీరాజనంగా మనం అందరం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే మహోత్సవమే గురుపూర్ణిమ. వ్యాసుడి జనన తిధి ‘ఆషాడ పూర్ణిమ’ ను గురు పూర్ణిమ గా మన పురాణాలు చెపుతాయి. లోకానికి భగవద్గీత ను అందించిన శ్రీకృష్ణుడు జగద్గురువైతే, శక్తివంతమైన సంస్కృతికి అవసరమైన విశాల వాజ్ఞ్మయ౦ మహాభారతాన్ని అందించిన వ్యాసుడు కూడా లోకానికి గురువే. అందుకే “గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరా” అంటారు. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆ మహానుభావులకు గురు స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వారందరి లోకి గురుస్తానీయుడు వేదవ్యాసుడు. అందరి గురువులకు గురు స్థానంలో ఉన్న మహోన్నత వ్యక్తి వ్యాసుడు. అందుకే ఆయన పుట్టిన రోజు ‘గురు పూర్ణిమ’ గా మన హైందవ సంస్కృతిలో జరుపుకుంటాం.

గురు పూర్ణిమ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది షిర్డీ సాయి నాధుని నామం. షిర్డీ బాబా కు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలలో గురు పూర్ణిమ ఒకటి. ఆయన జీవించినంత కాలం షిర్డీ లో ఈ గురు పూర్ణిమ ను అత్యంత ఘనంగా నిర్వహించే వారు. ఇప్పటికీ షిర్డీ సంస్థానంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సాయి ఆలయాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అందుకే ఈరోజు బాబా ఆలయాలు అన్నీ సాయి నామస్మరణతో జ్ఞాన యజ్ఞాలతో హోరెత్తిపోతాయి. “నటిస్తే నీవు దేనినీ గురువు నుండి పొందలేవు – హృదయ పూర్వకంగా గురువు ను ఆరాధిస్తేనే జ్ఞానాన్ని పొంధగలుగుతావు” అంటారు సాయి. అందుకే ఈ గురుపూర్ణిమ నాడు మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాకుండా మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువును సత్కరించే కార్యక్రమాలు ఈరోజు దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంటు ఎన్నో జరుగుతూనే ఉంటాయి.  షిర్డీ బాబా తన భక్తులను ఎప్పుడూ తనను భగవంతుడిగా చూడవద్దని, ఒక సద్గురువుగా చూడమని ఉపదేశించేవారు. తను చెప్పిన మాటలను హృదయ పూర్వకంగా ప్రేమతో, శ్రద్ధతో పాటించమని అప్పుడే తన అనుగ్రహాన్ని తన భక్తులు పొందగలుగుతారు అని బాబా తరచూ చెపుతూ ఉండేవారు. ఈ విషయం మనకు బాబా ఆత్మీయ భక్తుడు దాసగణు అనుభవం నుండి మనకు అవగతం అవుతుంది.

నేటికీ మన పుణ్య భారత భూమి ఆధ్యాత్మిక శక్తితో శోబిస్తోంది అంటే అందుకు కారణం జగద్గురువుల మార్గధర్శకమే. ఈ మార్గధర్శకత్వంతో వేలాది సంవత్సరాల క్రితమే చక్కటి సమాజాన్ని రూపొందించారు మన గురువులు. ఈ సమాజం సుస్థిరంగా, సుభిక్షంగా దినదినాభివృద్ధి చెందడానికి ఐదు కీలక అంశాలను గుర్తించి వాటిని మనకు మన గురువులు తెలియజేశారు. అవే కుటుంబం - విద్యా – వైద్యం - ఆర్ధిక – రాజకీయ వ్యవస్థలు. ఈ ఐదింటికి ఆధ్యాత్మిక శక్తిని కేంద్రభిందువుగా చేసి ఎన్నో విషయాలు మన ఆధ్యాత్మిక గురువులు మన హైందవ ధర్మంలో తెలియజేశారు. ఆమాటలను గుర్తుకు చేసుకొనే పుణ్య తిధి గురుపూర్ణిమ. రకరకాల అశాంతులతో, సంక్షోభాలతో నేడు నలిగిపోతున్న 120 కోట్ల భారతావనికి ఈ పుణ్య తిధి గురుపూర్ణిమ సకల మానసిక, శారీరిక సుఖ శాంతులను కలగజేసి, మన భారతదేశానికి పూర్వ వైభవం వచ్చేలా ఈ గురుపూర్ణిమ పుణ్యతిధి అఖండకోటి బ్రహ్మాండనాయకుడు సాయి నాధుడు మన అందరినీ ఆశిర్వాధించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: