ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ జోరు మామూలుగా లేదు. ఆ పార్టీలో చేరేందుకు ఒక్కొక్క‌రుగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే సీనియర్ నేత, బలమైన నాయకునిగా ఉన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు చేరిపోయారు. ఇపుడు పొరుగు జిల్లాలలోని నేతలు కూడా చేరేందుకు సై అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు జగన్ పార్టీలో బెర్తుల కోసం ఆరాటపడుతున్నారు.


ఆమె రాకతో :


ఇదిలా ఉండగా చాలాకాలంగా నానుతున్న ఓ వ్యవహారం ఇపుడు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీలో చేరేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణి రెడీ అవుతున్నారన్న ప్రచారం ఇపుడు వైసీపీలో కొత్త హుషార్ తెస్తోంది. వైద్యురాలుగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా జనాలకు బాగా చేరువైన క్రుపారాణి పార్టీలో చేరితే అది జిల్లాలో అదనపు  బలంగా ఉంటుందని అంటున్నారు. క్రుపారాణి బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు. ఆమెకంటూ సొంతంగా గుర్తింపు అనుచర గణం ఉన్నారు. నిజానికి జగన్ శ్రీకాకుళం పాదయాత్రలోనే ఆమె పార్టీలో చేరాల్సింది. సీట్ల వ్యవహారం అప్పట్లో తేలకపోవడం , మరో వైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తు వార్తలు కారణంగా ఆమె పార్టీలో  ఉండిపోయారని సమాచారం. ఇపుడు ఎటూ చేరికలు వూపందుకున్న వేళ తాను సైతం అంటూ ఆమె వస్తున్నారని అంటున్నారు.


సిక్కోలు ఎంపీగా :


క్రుపారాణి 2009 ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వస్తూనే సిక్కోలు నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బలమైన ఎంపీ క్యాండిడేట్ అవసరం ఎంతైనా ఉంది. దాంతో వైసీపీ ఆమెను సాదరంగా ఆహ్వానిస్తోందని అంటున్నారు. ఆమె కనుక  ఎంపీ అభ్యర్ధి అయితే ఇపుడు వైసీపీకి ఉన్న వూపులో ఆమె విజయం సాధించడం ఖాయమని కూడా అంటున్నారు. అన్ని రకాలైన సర్వేలు చూసుకున్న మీదటనే జగన్ ఆమెను పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: