పసి కూనలపై ప్రయోగాలు చేస్తున్నారా? నిలోఫర్‌లో అక్రమంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారా? ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు దండుకుని దుర్మార్గాలకు పాల్పడుతున్నారా? తల్లిదండ్రులకు తెలియకుండానే ఈ ట్రయిల్స్‌ సాగుతున్నాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు.. ప్రతిష్ఠాత్మకమైన నిలోఫర్‌లో జరుగుతున్న ఈ వ్యవహారం పెద్ద కలకలం రేపుతోంది. 


అది పిల్లలకు వైద్యం చేయాల్సిన ఆస్పత్రి.  అలాంటి ఆస్పత్రిలోనే చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా ప్రయోగించేది పిల్లలపైనే. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇలాంటి ప్రయోగాలకు నిలోఫర్‌ లోని కొందరు డాక్టర్లు సహకరిస్తుండటం అత్యంత విషాదకరం. క్లినికల్‌ ట్రయల్స్‌లో కొన్ని రకాల నిషేధిత డ్రగ్స్‌ కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంటూ పిల్లలపై ట్రయల్స్‌ సాగిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 


ల్యాబ్‌ లలో అభివృద్ధి పరిచిన మందులు, వ్యాక్సిన్ లు సరిగా పనిచేస్తున్నాయో లేదో మనుషులు లేదా రోగులపై పరీక్షలు చేస్తుంటారు. వీటినే క్లినికల్‌ ట్రయల్స్‌ అంటారు. ఒకవేళ మందు వికటిస్తే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటికి కొన్ని చట్టాలు ఉన్నాయి. వాటికి లోబడే పరీక్షలు చేపట్టాలి. పిడియాట్రిక్స్‌ విభాగంలోని ఒక ప్రొఫెసర్‌ ఫార్మా కంపెనీలతో కలిసి అనధికారికంగా ట్రయల్స్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్వైన్‌ ఫ్లూ, రొటా, హెచ్‌పీవీ, ఎంఆర్‌ వ్యాక్సిన్లను పిల్లలకు ఇస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లల రక్త నమూనాలు కూడా సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. కొంత కాలంగా ఇది సాగుతున్నా.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. అయితే అనుమతులు తీసుకునే పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్నారు సదరు ప్రొఫెసర్‌. 


ఈ మధ్య ఇద్దరు డాక్టర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో రహస్యంగా సాగుతున్న క్లినికల్‌ ట్రయల్స్ వ్యవహారం బయటపడింది. ఫార్మా కంపెనీల ప్రతినిధుల సమక్షంలోనే చాలా రోజుల నుంచీ ట్రయల్స్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గుట్టుచప్పుడు సాగుతున్న ఈ వ్యవహారంలో డాక్టర్లకు లక్షలు కుమ్మరిస్తున్నాయి ఫార్మా కంపెనీలు. కింది నుంచి పై వరకూ వారి హోదాలుకు తగ్గట్టుగా ముట్టచెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇప్పటి వరకూ 50 మంది పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. అందులో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. క్లినికల్‌ ట్రయల్స్‌పై సూపరింటెండెంట్‌ కే అవగాహన లేదంటున్నారు వైద్యులు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: