పుంగనూరులో బిసివై (భారత చైతన్య యువజన పార్టీ) అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పైన తాజాగా వైసిపి మూకలు విచక్షణా రహితంగా దాడి దాడిచేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. గతంలోనూ ఇటువంటి చర్యలే ఇక్కడ జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. తాజాగా వైసీపీ కార్యకర్తలు భారత చైతన్య యువజన పార్టీ మనుషులను దూషించడం, ప్రచార వాహనాలను తగులబెట్టడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... "పుంగనూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాగీరా?" అంటూ కె రామకృష్ణ తాజాగా ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది.

ఒక్కసారి ఆ లేఖను గమనిస్తే... పుంగనూరులో వైసిపి శ్రేణుల దాష్టీకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిన్న సదుం మండలంలో బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పై వైసిపి రౌడీలు రాళ్లు, కర్రలతో
అత్యంత దారుణంగా దాడి చేసారు. అక్కడితో ఆగకుండా ప్రచార వాహనాలను తగులబెట్టడం దుర్మార్గం. అదంతా ఒకెత్తయితే సదుం పోలీస్ స్టేషన్ ఎదురుగానే ప్రచార వాహనాన్ని తగుల బెట్టారు. ఇక కళ్లెదుటే దాడులు జరుగుతున్నా సదుం పోలీసులు ఏమీ చేయలేక చేవలేని వారిగా ఉండిపోవడం విచారకరం. అలాగే బోడే రామచంద్రయాదవ్ స్థానికంగా భోజన ఏర్పాట్లు చేశారనే అక్కసుతో బిసివై పార్టీ నాయకులు ఆనందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం వారి రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది.

గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా వైసిపి శ్రేణులు దాడి చేయడం, వాహనాన్ని తగులబెట్టి విధ్వంసం సృష్టించడం అందరికీ తెలిసినదే. రాష్ట్రంలో శాంతి భద్రతలు మచ్చుకైనా లేవు అనడానికి ఇవే నిదర్శనం. అవును, పుంగనూరులో ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఇతర పార్టీల వారు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రౌడీరాజ్యం పుంగనూరులో నడుస్తోందనడానికి ఇదే నిదర్శనం. పుంగనూరేమన్నా పాకిస్తాన్లో ఉండా లేక పెద్దిరెడ్డి జాగీరా? అని ప్రశ్నిస్తున్నాం! పుంగనూరును సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం... అని ఒక నోటిస్ రిలీజ్ చేసారు కె రామకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: