జమ్మూకాశ్మీర్‌ చరిత్రలో సరి కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ పునర్విభజన బిల్లు ఆగస్టు 5న పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకాశ్మీర్‌, లద్దాఖ్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఇక ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ.. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం ప్రక్రియ అమల్లోకి రానుంది.


ఉమ్మడి జమ్ముకాశ్మీర్‌కు చివరి ముఖ్యమంత్రి, గవర్నర్‌గా మెహబూబా ముఫ్తీ, సత్యపాల్‌ మాలిక్‌ ఉన్నారు. ఒక రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంగా మారడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దేశ ఐక్యతా దినోత్సవం సందర్భంగా జమ్ముకాశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. శ్రీనగర్‌లో.. జమ్ముకాశ్మీర్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా గిరీష్‌చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు.


జమ్ముకాశ్మీర్‌ విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో.. లెఫ్టినెంట్‌ గవర్నర్లకు అధికారాలు ఉంటాయి. విభజన తర్వాత ఐఏఎస్ , ఐపీఎస్ కేంద్ర విధుల్లో ఉన్న అధికారులు గతంలో ఉన్న పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతారు. జమ్ముకాశ్మీర్, లద్దాఖ్‌లలో ఎక్కడైనా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం ఉంది.


ఇరు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ నూతన లెఫ్టినెంట్‌ గవర్నర్లు.. ప్రమాణ స్వీకారం చేశారు. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారత చిత్రపటం సరికొత్తగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశం.. 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలతో నవ భారతంగా రూపుదిద్దుకుంది. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణానికి ముగింపు పలికి.. భారత చట్టంలో సరికొత్తకాశ్మీరం దర్శనమిచ్చింది.


ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కాశ్మీర్‌లో పర్యటించలేదు. ఐక్యత దినోత్సవం సందర్భంగా లేహ్‌, శ్రీనగర్, జమ్ముల్లో కూడా ఐక్యతా పరుగు నిర్వహిస్తారు. మరి ఇకనైనా కాశ్మీర్ ప్రశాతంగా ఉంటుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: