2014లో అధికారం కోసం ఆశపడి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకున్న వాళ్ళలో గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరిలు ముందు వరుసలో ఉంటారు. రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన జగన్ ని కాదని వీరు చంద్రబాబు చెంతకు చేరి కష్టాల్లో కొట్టమిట్టాడుతున్నారు. ఇక వీరితో పాటు మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన వీరికి టీడీపీలో భవిష్యత్తు కనపడటం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి పాడేరు నుంచి గెలిచిన గిడ్డి ఈశ్వరి...తర్వాత బాబు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. 

 

ఇక ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించిన ఆమె మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇదేవిధంగా 2014లో రంపచోడవరం నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి...తర్వాత టీడీపీలోకి వెళ్ళి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అటు అరకు నుంచి 2014లో కిడారి సర్వేశ్వరావు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో వెళ్లారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో నక్సలైట్ల కాల్పుల్లో ఆయన ప్రాణం కోల్పోయారు.  

 

దీంతో చంద్రబాబు ఆయన తనయుడు కిడారి శ్రవణ్ కుమార్ ని రాజకీయంలోకి తీసుకొచ్చి బాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఆరు నెలలు మంత్రిగా చేసిన తర్వాత శ్రవణ్ అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అసలు రాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధి కూడా శ్రవణ్ నే. ఇక్కడ ఈయన మూడో స్థానంలో నిలిచారు. ఇక ఓటమి తర్వాత వీరు పార్టీలో యాక్టివ్ గా ఏమి లేరు. అయితే వీరు ఇలాగే టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు శూన్యమయ్యే అవకాశముంది. 

 

ఎందుకంటే ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడ గిరిజనులు ఎక్కువ శాతం వైఎస్సార్ అభిమానులుగా ఉంటారు. అందుకే వారు వైసీపీ వైపు ఎక్కువ ఉంటారు. దీంతో ఇక్కడ టీడీపీ మనుగడ సాగించడం కష్టం. పైగా ప్రస్తుతం టీడీపీ పరిస్తితి కూడా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఇక్కడ కోలుకోవడం గగనం...ఈ ముగ్గురు రాజకీయ భవిష్యత్తు దెబ్బతినడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: