రాజకీయాలు వ్యవస్థలను నడిపించాలి.. ప్రజల బాగు కోసం పని చేయాలి. అవే రాజకీయాలు దేవుడి వరకూ రాకూడదు. కానీ.. ఇప్పుడదే జరుగుతోంది. మహారాష్ట్రలోని శిరిడి సాయి అశేష ప్రజలకు దైవం. ఖండాంతరాలకు వ్యాపించిన శిరిడి సాయి ఖ్యాతిని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ నిర్ణయం వల్ల శిరిడి గ్రామస్థులకు, సంస్థాన్ కు, సాయి భక్తులకు ఇబ్బంది కలిగిస్తోంది. సాయిపై ప్రభుత్వ నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంటోంది.

 

 

రేపటి నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత అనే వార్త నిన్నటి నుంచీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతోమంది బాబా భక్తులకు మింగుడుపడని ఈ వార్తతో అలజడి రేగింది. ప్రశాంతతకు ప్రతిరూపంగా ఉండే శిరిడీ సాయిబాబా జన్మభూమి రాజకీయ వివాదంగా మారపోయింది. సాయి జన్మించిన పాథ్రీని అభివృద్ధి చేస్తామన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. పాథ్రీకి రూ.100 కోట్లు ప్రకటించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం శిరిడి గ్రామస్థులకు, సాయి సంస్థాన్, బీజేపీలకు ఆగ్రహం తెప్పించింది. షిర్డీపై ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాజకీయ ఆరోపణ వచ్చింది. ఇప్పటివరకూ ఎటువంటి వివాదం లేని సంస్థాన్ ను రాజకీయ వివాదంలోకి వచ్చేలా చేయడాన్ని సాయి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ శిరిడీకి భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. సాయిని దర్శించుకునేందుకు నెలల ముందు నుంచీ ప్రయాణానికి సిద్ధమవుతారు. శిరిడీ వచ్చిన వారికి నిన్నటి నుంచీ వచ్చిన వార్తలు ఆందోళనకు గురి చేశాయి. కానీ.. భక్తుల రాక, వారికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఉన్న సంస్థాన్ సభ్యులు ఆలయం మూసి వేయడంలేదని ప్రకటించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వివాదంపై షిర్డీ గ్రామస్థుల భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చ చేయనున్నారు. ఈ అంశంపై ఏ నిర్ణయం వస్తుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: