మధిర.. ఖమ్మం జిల్లాలో ఇదో కీలక మున్సిపాలిటీ. ఎందుకంటే తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన కీలక నేత ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన వాయిస్ గా ఉన్నారు. విద్యాధికుడుగా.. సౌమ్యుడిగా విషయం ఉన్న నేతగా పేరు సంపాదించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన అతికొద్దిమంది ఎమ్మెల్యేల్లో భట్టి ఒకరు. ఇప్పడు ఆయన ప్రతిష్ట పెరగాలంటే ఈ మున్సిపాలిటీలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.

 

మధిరలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని వార్డులకూ కలిపి 120 మంది వరకూ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే ఉపసంహరణ తర్వాత చివరకు 67 మంది బరిలో నిలిచారు. ఇక ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం 22 వార్డులకూ అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే కూటమిగా బరిలో దిగుతున్న కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, బీజేపీ మొ‌త్తం 22 వార్డులను అవగాహన మేరకు పంచుకున్నాయి.

 

కాంగ్రెస్ సగం సీట్లలో అంటే 11 సీట్లలో పోటీ చేస్తోంది. బీజేపీ 13 చోట్ల, టీడీపీ 7 చోట్ల, సీపీఎం మూడు చోట్ల, సీపీ ఐ రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. స్వతంత్రులు మరో 9 మంది బరిలో ఉన్నారు. మొత్తం కూటమిని ఏకతాటిపై నడిపి.. మధిర మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని భట్టి విక్రమార్క పట్టుదలతో ఉన్నారు. అయితే అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

 

ఎన్నడూ లేనిది.. నామినేషన్ల ఉపసంహరణలో పోలీసుల జోక్యం పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ ఎంత అరాచకాలకు పాల్పడినా విజయం తమదే అన్న దీమా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి మునిసిపల్ ఎన్నికల్లో బదులు తీర్చుకోవాలని అధికార పార్టీ పట్టుదలతో ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: