ఏపీ సీఎం జగన్ డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల గురించి ప్రకటన చేసిన తరువాత మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ఆ తరువాత గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేశారు. కానీ శాసనమండలిలో అడ్డంకులు ఎదురు కావడంతో శాసన మండలి రద్దు కోసం ఓటింగ్ జరిపి రద్దుతీర్మానాన్ని కేంద్రానికి పంపారు. 
 
ప్రస్తుతం అధికారికంగా ఏపీలో కార్యాలయాల తరరలింపు జరుగుతూ కర్నూలు, విశాఖ నుండే పరిపాలనా కార్యక్రమాలు జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజధాని అమరావతి ఎక్కడికీ తరలిపోదంటూ గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాజధాని తరలింపు ఆగిపోతుందని రాయపాటి ధీమా వ్యక్తం చేశారు. 
 
తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ రాయపాటి త్వరలోనే ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడుతుందని అమరావతిని దాటి రాజధాని ఎక్కడికీ వెళ్లదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాజధాని తరలింపును ఖచ్చితంగా అడ్డుకుంటుందని అన్నారు. గత 50 రోజులుగా అమరావతి ఉద్యమం కొనసాగుతోందని సీఎం జగన్ మాత్రం ఈ ఉద్యమాన్ని పట్టించుకోవడం లేదని రాయపాటి అన్నారు. 
 
తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని టీడీపీలోనే తనకు సంతోషంగా ఉందని రాయపాటి చెప్పారు అమరావతి పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారని వారు ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి అమరావతి నుండి రాజధానిని తరలించవద్దంటూ విన్నవించుకోనున్నారని రాయపాటి తెలిపారు. రాయపాటి తెలుగుదేశం పార్టీ రాజధానిని ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పడం ఆ పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ మూడు రాజధానుల దిశగా ముందడుగులు వేస్తుండగా రాయపాటి చేసిన వ్యాఖ్యలు ఎక్కడో తేడా కొడుతున్నాయే అని తెలుగుదేశం పార్టీ నేతలకే అనిపిస్తోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: