ఏపీ సీఎంగా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సంచలనం గానే ఉంటుంది. జగన్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నా జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఏపీలో తన మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చేయడంతో పాటు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు నిజాయితీగా, అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో పరిపాలన అందించాలని జగన్ చూస్తున్నారు. అందుకే గత ప్రభుత్వంలో అవినీతిని వెలికి తీయడంతో పాటు ఎప్పటి నుంచో చిక్కుముడిగా ఉన్న కొన్ని కొన్ని ప్రభుత్వ విధానాలను కూడా మార్చే ఉద్దేశంలో ఏపీ సీఎం ఉన్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే భూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధమయ్యారో ఆ విధంగానే జగన్ ఇప్పుడు ఏపీలో భూ సర్వేకు సిద్ధం అవుతున్నారు. 


ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రేపటి నుంచి ప్రతి రెవెన్యూ గ్రామం లో ముగ్గురితో కూడిన బృందం భూ సర్వే నిర్వహించి ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం లో తక్కెళ్ళపాడు పైలెట్ ప్రాజెక్టుగా ఉదయం 11 గంటలకు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారికంగా భూ సర్వేను ప్రారంభిస్తున్నారు. స్వాతంత్రం రాక ముందు 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సర్వే చేసి ఆర్ఎస్ ఆర్ ను తయారు చేశారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ప్రామాణికంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతి 30 ఏళ్లకు ఒకసారి సర్వే చేయాల్సి ఉన్నా... దానిని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 


తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం, ఇలా ఎన్నో జరుగుతున్నా పాత విధానం మారలేదు. 120 ఏళ్ల లో భూములు పరంగా చెప్పలేనన్ని మార్పులు జరిగాయి. దరఖాస్తు పట్టాలు ఇవ్వడం వల్ల సబ్ డివిజన్, సర్వే నెంబర్లు పెరిగిపోయాయి. భూమి హద్దులు విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. దీనిని అవకాశంగా తీసుకుని గత టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను ఆ పార్టీ నాయకులు అన్యాక్రాంతం చేశారు. దీంతో ఆ వివరాలన్నింటినీ బయటకు లాగి అక్రమార్కులు చెరలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసే విధంగా జగన్ ముందుకు కదులుతున్నారు. 


ఇప్పటికే టిడిపి నాయకులు ఆక్రమించిన భూములకు సంబంధించి ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉండడంతో పాటు భూ సర్వే కు సంబంధించి సమగ్రమైన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా మరింతగా పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో జగన్ సర్వే కు సిద్ధమవుతున్నారు. జగన్ నిర్ణయంతో భూ బకాసురులలో ఆందోళన మొదలైంది. గత టిడిపి ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకున్న వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. భూ సర్వే ద్వారా తమ ఆక్రమణ బాగోతాలు ఎక్కడ బయటకి వస్తాయో అని వీరు భయం భయం గా ఉండగా సామాన్యులు మాత్రం జగన్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: