విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తరువాత .. విజయనగరం జిల్లా  సరిహద్దు ప్రాంతాలకు మహర్దశ పట్టింది. పంట పండని భూములు కూడా బంగారమవుతున్నాయి. ఓ వైపు  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ..మరోవైపు ఎగ్జిక్యూటివ్  క్యాపిటల్ నిర్మాణాలకు సిద్దం అవుతుండటంతో.. రియల్ బూమ్ ఉపందుకుంది. 

 

ఓ వైపు సువిశాలమైన తీర ప్రాంతం. మరోవైపు జాతీయ రహదారి. ఇంకో వైపు ఎంతో చరిత్ర ఉన్న భీమిలి ప్రాంతం. విశాఖ సిటీకి కూత వేటు దూరంలో ఉన్న  విజయనగరం జిల్లా  భోగాపురం మండలం  ఇప్పుడు బంగారమవుతోంది . ఇప్పటికే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా, తాజాగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తుండటంతో భోగాపురంకు మరింత ప్రాధాన్యత పెరిగింది. 

 

బోగాపురం హౌరా -చెన్నై జాతీయ రహదారి కి ఆనుకుని  విశాఖకు అత్యంత సమీపంలో ఉండటంతో.. అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఆవిర్భవించింది. ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖ పరిపాలన రాజధాని  ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఇప్పటికే భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విమానాశ్రయం ప్రతిపాదనల సమయంలోనే  ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఇక ఏపీ ప్రభుత్వం తాజాగా పరిపాలనా రాజధానిని విశాఖ లో ఏర్పాటు చేయాలని .. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కాపుల ఉప్పాడ ప్రాంతంలోని మిలీనియం టవర్స్ లో ఏర్పాటు చేయాలని  నిర్ణయించడంతో ..   కాపుల ఉప్పాడకి సమీపంలో ఉన్న భోగాపురం మండలంలోని భూముల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి.

 

భోగాపురం తీర ప్రాంతంలో.. బీచ్ రిసార్టులు వెలిసి, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతోంది.  భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్టు కూడా రానుండటంతో భవిష్యత్ లో ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుందని స్థానికకులు సంబర పడుతున్నారు. భోగాపురం మండలం విశాఖ రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండటం, విశాఖ సిటీ నుంచి అనకా పల్లి వరకు ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్ ఉండటంతో.. రాజధాని మొత్తం శ్రీకాకుళం వైపే అభివృద్ధి చెందే అవకాశం ఉంది.  

 

భోగాపురం మండలంలోని గ్రామాల్లో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన దశలో.. ఎకరా 35 నుంచి 50 లక్షలు పలకగా.. ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల వరకు చేరింది. భోగాపురం హైవేకి ఆనుకుని ఉన్న భూములైతే.. ఎకరా పది కోట్ల వరకు రేట్లున్నాయి. ఇప్పటికే అనేక వెంచర్లు  అమ్ముడు పోవడంతో.. వ్యాపారులు రీసేల్  చేసే వారికోసం జల్లెడ పడుతున్నారు.

 

ఒక్కసారిగా భోగాపురంలో రియల్ బూమ్ ఊపందుకోవడంతో.. విజయవాడ, హైదరాబాద్ , బెంగళూరు రియల్టర్లు.. క్యూ కడుతున్నారు. ఎంతైనా ఇచ్చి భూములు కొనడానికి రెడీ అవుతున్నారు. అయితే ముందు ముందు మరింత రేట్లు పెరుగుతాయని ఇక్కడి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఏపీలో ఓ మూలకు విసిరేసినట్టు ఉండే భోగాపురం తీర ప్రాంతం ఇప్పుడు బంగారు బాతులా తయారైంది .  

మరింత సమాచారం తెలుసుకోండి: