అసలు ఈనాడులో ఒక వార్త వచ్చింది అంటే అది ఒక అక్షర సత్యం. దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. ఈనాడులో ఒక వార్త వచ్చింది అంటే అది శిలా శాసనంగా మొదట్లో అందరూ నమ్మేవారు. రామోజీ నమ్మించే వాడు. ప్రభుత్వం అధికారులు ఇలా ఎవరైనా సరే ఈనాడులో ఏదైనా వ్యతిరేకత వస్తే ఆందోళన, భయంతో వణికిపోయేవారు. ఎందుకంటే ప్రజలు ఈనాడు కథనాలను అంతగా నమ్మేవారు. కానీ ఆ తరువాత ఆ పరిస్థితి మారింది. మీడియా మొఘల్ గా పేరుపొందిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మొదటి నుంచి ఉన్న వైఖరికి ఇప్పటి వైకిరికి చాలా తేడా కనబడుతోంది. ఈనాడు రాతల వెనుక ఉన్న స్వామి కార్యం, స్వకార్యం ఏమిటో జనాలకు బాగా అర్థమైపోయింది.


 ఒకవైపు పత్రికలకు పాఠకుల ఆదరణ తగ్గిపోతూ ... నిర్వహణ కష్టమవుతున్న సమయంలో పత్రికలు, వాటి యాజమాన్యాలు ప్రభుత్వాలతో సున్నం పెట్టుకుంటే ఏమవుతుందో తెలియంది కాదు. పత్రికలకు వచ్చే ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా ఆగిపోతాయి. పత్రికాధిపతుల లొసుగులు అన్నీ బయటకి వస్తాయి. అదే జరిగితే ఉద్యోగుల జీతాలు, పత్రిక నిర్వహణ కష్టం అయిపోతుంది. నష్టాలు భరించాల్సి ఉంటుంది. అందుకే చాలాకాలంగా మీడియా యాజమాన్యాలు తమ వైకిరిని మార్చుకున్నాయి. ఈనాడు కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అంతా మారిపోయారు. ఎక్కడా వ్యతిరేక కథనాలు ప్రచురించేందుకు సాహసించడం లేదు.


ఏపీలో లో ఈనాడు ఈ వైకిరి అవలంబిస్తున్నా లేకపోయినా... తెలంగాణలో మాత్రం తూచా తప్పకుండా పాటిస్తోంది. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే కెసిఆర్ ఏం చేస్తాడో రామోజీకి ఆయన సంస్థ ఈనాడు కు బాగా తెలుసు. ఎవరు చెప్పినా కెసిఆర్ వినే రకం కాదు. అందుకే జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం విషయంలో ఈనాడు వ్యవహరిస్తూ వస్తోంది. కొద్ది నెలల క్రితం ఈనాడులో కీలక విభాగాలు చూసేవారు అందరితోనూ మీటింగ్ పెట్టిన రామోజీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం జోలికి వెళ్లవద్దని, ఎక్కడా వ్యతిరేక కథనాలు ప్రచురించవద్దని తీర్మానం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా... తాజాగా  ఈనాడు లో వచ్చిన కథనం టిఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. అందులో కేసీఆర్ గురించి, ఆయన పార్టీ గురించి కథనంలో లేకపోయినా పోలీసు వ్యవస్థ గురించి అందులో సాగుతున్న మామూళ్ల వ్యవహారం గురించి ఓ కథనాన్ని ప్రచురించింది. 

 

'దొంగలతో దోస్తీ' అంటూ పోలీసుల తీరును తప్పు పడుతూ ఓ పెద్ద కథనాన్ని ప్రచురించారు. అందులో పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోయారని, ఎవరిని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారని ఇలా ఎన్నో ఆరోపణలతో కథనాన్ని ప్రచురించారు.  అయితే ఇందులో టిఆర్ఎస్ కు అంతగా ఆగ్రహం కలిగించే అంశాలు ఏమీ లేకపోయినా... ఏదో ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం పైన బురద చల్లేందుకు రామోజీ ప్రయత్నిస్తున్నాడనే అనుమానం కేసీఆర్ లో కలిగింది. ఇంకేముంది వెంటనే దీనిపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. 


 ముగ్గురు పోలీస్ కమిషనర్లు, డీజీపీ, హోంమంత్రి ఇలా అందరూ దీనిపై ఎప్పుడూ లేనంత స్థాయిలో  స్పందించారు. ఇదేంటి ఈనాడు అంటూ మండిపడ్డారు. పోలీస్ అధికారుల సంఘం కూడా దీనిపై ఏంటి ఈనాడు నీ సంగతి అంటూ స్పందించింది. ఇక ప్రభుత్వంలో ఉన్నా  లేనట్టుగానే వ్యవహరించే హోంమంత్రి కూడా దీనిపై గట్టిగా గొంతు పెంచేసాడు. సారీ చెబుతావా లేదా రామోజీ...?  లేకపోతే వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేయమంటావా  అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భయపడిపోయిన ఈనాడు అధిపతి రామోజీ తర్వాతి రోజు మొదటి పేజీలో దాదాపు క్షమాపణ చెబుతున్న రేంజ్ లో వివరణ ఇచ్చాడు.


 ఒకప్పుడు ప్రభుత్వాలను శాసించి తను అదుపు ఆజ్ఞల్లో పెట్టుకున్న రామోజీ ఇప్పుడు తాను ప్రచురించిన ఓ చిన్న కథనానికి ప్రభుత్వ పెద్దల ఆగ్రహాన్ని చూసి వణికిపోవడం చూసి ఓర్ని రామోజీ ఏంటి ఇంతగా వణికిపోవడం ఏంటి అంటూ ఆయన సంగతి బాగా తెలిసిన మీడియా మిత్రులు, రాజకీయ నాయకులు జోకులు వేసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: