ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అరాచకపర్వం కొనసాగుతోంది. అమ్మాయిల హాస్టళ్లలోకి ఆకతాయిలు చొరబడటం కలకలం రేపుతోంది.  వసతి గృహాల్లో విద్యార్థినులకు భద్రతే లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. విద్యార్థినుల రక్షణ చర్యలు అధికారులు గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. రాత్రి పూట గదుల్లోకి కొందరు యువకులు దూరుతుండటంతో విద్యార్థినులు భయాందోళనలకు గురవుతున్నారు. అర్ధరాత్రి కరెంట్ నిలిపేసి మరీ హాస్టళ్లలోకి చొరబడుతున్నారు. అసలు...వసతి గృహాల్లో స్టూడెంట్స్‌కు సేఫ్టీ లేకుండా పోవటానికి కారణం ఏంటి?

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బాలికల హాస్టళ్లకు భద్రత కరువైంది. పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించటం కోసం వసతి గృహాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కార్పొరేట్ స్థాయి విద్య, ఆశ్రమం కల్పిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వసతి గృహాల్లోని విద్యార్థినులు ఆకతాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట బాలికల గదుల్లోకి ఆకతాయిలు చొరబడుతున్నారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

 

ఇటీవల కెరెమెరి మండలం మోడి గిరిజన బాలికల వసతి గృహంలోకి ముగ్గురు ఆకతాయిలు చొరబడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ గదుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆరు వందల మందికి పైగానే విద్యార్థినులు ఉంటున్నారు. ఎనిమిది, పదో తరగతి చదువుతున్న బాలికల గదుల్లోకి అర్ధరాత్రి సమయంలో ముగ్గురు యువకులు చొరబడ్డారు. ఇది గమనించిన విద్యార్థినులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ముగ్గురిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు హాస్టల్ సిబ్బంది. పట్టుబడిన వారిలో ఒకరు మైనర్‌ కూడా ఉన్నాడు. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదే వసతి గృహంలో గతేడాది ఓ అమ్మాయిని ఇంటికి తీసుకెళతానని చెప్పి ఓ యువకుడు బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కుమ్రం భీం ప్రాజెక్టు వద్ద అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అమ్మాయి చాకచక్యంగా తప్పించుకుని ఆసిఫాబాద్‌కు చేరుకుంది.

 

ఇక...ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మరో ఘటన చోటుచేసుకుంది. వెంటిలేటర్ గుండా ఓ యువకుడు అర్ధరాత్రి అమ్మాయిల గదిలోకి దూరాడు. ఇక్కడ వంద మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఇందులో ఇంటర్‌ చదివే నలుగురు విద్యార్థినులు ఉంటున్న గదిలోకి ఒక యువకుడు చొరబడ్డాడు. విద్యార్థినులు గుర్తించి అరిచేసరికి వెంటిలేటర్‌ ఎక్కి పారిపోయాడు. ఇలా నిత్యం వసతి గృహాల్లోకి ఆకతాయిలు చొరబడటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

 

మరోవైపు...నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం మస్కాపూర్‌ కస్తూర్బా పాఠశాలలో ఇదే తరహా ఘటన జరిగింది. విద్యాలయంలోకి ఓ యువకుడు రాత్రి సమయంలో వచ్చాడు. ఇది గమనించిన విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మాయిల హస్టళ్లకు భద్రత కల్పించటం లేదనే ఆరోపణలున్నాయి. వసతి గృహాలకు కనీసం ప్రహరీ గోడలు కూడా లేవు. వాచ్‌మెన్‌లు సక్రమంగా లేరు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయనే ఆరోపణ లున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అమ్మాయిల హస్టళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: