దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్నటివరకు తెలంగాణలో 503 కేసులు నమోదు కాగా ఏపీలో 405 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నిన్న 24 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 16 కేసులు నమోదయ్యాయి. కొందరు దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉన్నా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. 
 
ఇలాంటి వారి కోసం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. స్వచ్ఛందంగా జలుబు, జ్వరం, పొడి దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వారు కరోనా పరీక్షలు చేయించుకుంటే వారికి నగదుతో పాటు బహుమతులు అందజేస్తామని ప్రకటన చేశారు. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని... వైద్య సిబ్బంది సమాచారం ఇచ్చిన వారి ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 
 
పరీక్షలలో కరోనా నిర్ధారణ అయితే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చేసి వీలైనంత త్వరగా కరోనా నుంచి కోలుకోవడానికి సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి వారం లక్కీ డిప్ ద్వారా పరీక్షలు చేయించుకున్న వారిలో ఐదుగురిని ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులతో పాటు 5,500 రూపాయల నగదు అందజేస్తామని చెప్పారు. 
 
నిన్న కలెక్టరేట్ లో కలెక్టర్ గత వారం పరీక్షలు చేయించుకున్న వారిలో లక్కీడిప్ ద్వారా ఐదుగురిని ఎంపిక చేసి వారికి కుక్కర్, గ్యాస్, స్టౌ, గ్రైండర్, మిక్సీ లాంటి బహుమతులను అందజేశారు. నిన్న రాత్రి వరకు జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: