ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో 81 కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం కృష్ణా జిల్లాలోనే 52 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ అసలు నిజం వేరు. 
 
రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తోంది. దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన కిట్ల ద్వారా వేగంగా పరీక్షలు చేస్తోంది. అందువల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా మరికొన్ని రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో మొదట్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైనా సీఎం కేసీఆర్ కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో కూడా మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అధిక సంఖ్యలో కేసులు నమోదైన కర్నూలు జిల్లాలో ఈరోజు కేవలం 4 కేసులే నమోదు కావడం గమనార్హం. 
 
కృష్ణా జిల్లాలో ఈరోజు అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ను పొడిగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: