బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి టాలీవుడ్ హీరోల మద్దతు పెరిగిపోతోంది. మోడీని కలిసేందుకు హీరోలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... మోడీని కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మోడీని కలిసేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఇవాళ ఆయన మోడీతో భేటీ కానున్నారు. రెండ్రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత నాగార్జునతో వెంకయ్య నాయుడు మంతనాలు జరిపినట్లు తెలిసింది. మోడీని కలిసే విషయంపై వీరిద్దరి చర్చ జరిగింది. పవన్ లాగా పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోయినా... కింగ్ కూడా మోడీకే మద్దతివ్వాలని భావిస్తున్నారట. ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. నాగార్జున ఎన్నికల్లో పోటీ చేయరని... అయితే ఆయన భార్య అమలకు విజయవాడ లోక్ సభ సీటు కోరుతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. పవన్, నాగార్జునే కాదు... మరో పాపులర్ హీరో కూడా మోడీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారముంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా ఒక్క టీడీపీలోనే సినీ నటుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ స్వతహాగా సినీ యాక్టర్ కావడంతో... ఆయన పార్టీ పెట్టినప్పుడు సినీ రంగానికి చెందిన చాలామంది తారలు టీడీపీలో చేరారు. చంద్రబాబు హయాంలో కూడా ఇది కొనసాగింది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సినీ నటులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని యోచిస్తోంది. హీరోలు ప్రత్యక్షంగా బీజేపీలో చేరినా, లేకపోతే మద్దతు ప్రకటించినా... అది ఆ పార్టీకి ప్లస్ పాయింటే. అయితే టాప్ హీరోలంతా మోడీకి మద్దతు ప్రకటించేందుకు క్యూ కట్టడం... టాలీవుడ్ లో హాట్ టాపిక్ లా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: