జాతీయ విద్యావిధానంపై మరోసారి విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ వివరణ ఇచ్చారు. కేంద్రం ఇచ్చింది సూచన మాత్రమేనని.. అది కూడా అవకాశం ఉన్నంత మేరకు అని మాత్రమే విద్యావిధానంలో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి అంటున్నారు. అదే సమయంలో తెలుగు మీడియం కోరుతున్న పెద్దలకు మంత్రి సురేశ్ షాక్ ఇచ్చారు. ఒకవేళ తెలుగు మీడియంలోనే ప్రాథమిక విద్యను ప్రవేశ పెట్టాల్సి వస్తే ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిస్తుందని ఆదిమూలపు సురేశ్ తేల్చి చెప్పారు.
అంతే కాదు.. ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన రమాదేవీ స్కూల్ లో తెలుగు మీడియం ఎందుకు పెట్టలేదని మంత్రి సురేశ్ నిలదీశారు. తాము ఇంగ్లిష్ మీడియంకు కట్టుబడి ఉన్నామని.. అలాగని తెలుగును ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యలేదని మంత్రి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరు తమ గ్రామానికి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారని.. అలాంటి పరిస్థితుల్లో విపక్షాలు, కొన్ని పత్రికలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని మంత్రి హితవు పలికారు.
ఒవేళ పూర్తిగా తెలుగు మీడియం ఉండాలంటే ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోను అమలు చేయాల్సి ఉంటుంది అని సురేష్ వార్నింగ్ ఇచ్చారు. ఒక విధంగా చూస్తే మంత్రి సురేశ్ చెప్పింది కూడా పాయింటే... ఐదో తరగతి వరకూ తెలుగు మీడియం తప్పనిసరి చేస్తే అది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకూ వర్తిస్తుంది. మరి అప్పుడు ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు కూడా ఐదో తరగతి వరకూ తెలుగులోనే బోధిస్తాయా.. ఈ విద్యావిధానాన్ని అమలు చేస్తాయా అన్నది అనుమానాస్పదమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి