పాఠశాలలు, కాలేజీలు తెరవకపోవడం వల్ల విద్యార్థులు పనిదినాలను నష్టపోయారు. దీంతో ఏపీ ఇంటర్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ వల్ల పాఠశాలలు తెరవడం ఆలస్యం కావడంతో సిలబస్ ను 30 శాతం తగ్గించింది. విద్యాశాఖ వెబ్ సైట్ లో ఆ వివరాలను అందుబాటులో ఉంచింది. సీ.బీ.ఎస్.ఈ ఇప్పటికే 30 శాతం సిలబస్ తగ్గించి అందుకు అనుగుణంగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది.
సాధారణంగా సంవత్సరానికి 220 పనిదినాలు ఉండగా సెప్టెంబర్ 5 నుంచి కాలేజీలను ప్రారంభిస్తే 175 పనిదినాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే రెండవ సంవత్సరం విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం లెక్చరర్లు ఇప్పటికే విద్యార్థుల వివరాలను సేకరించారు. పదో తరగతి పూర్తి చేసి ఇంటర్ లో చేరేందుకు ఆసక్తి చూపిన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులను బోధించనున్నారు.
మరోవైపు ఏపీలో నిన్న తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ 9,000కు అటూఇటుగా కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలో నిన్న 8,012 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 85,945 యాక్టివ్ కేసులు ఉండగా 2,650 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 2,01,234 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కేసుల సంఖ్య పెరగడకుండా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి