ఇటీవల కాలంలో ఏపీలో హిందూ ఆలయాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.  గుర్తు తెలియని దుండగులు కావాలని ఆలయాలని టార్గెట్ చేసి దేవుడు విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు. ఇక ఈ దాడులకు కారణం జగన్ ప్రభుత్వమే అని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తుంది. జగన్ క్రిస్టియన్ అని అందుకే హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో హిందూత్వం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

అటు వైసీపీ సైతం, టీడీపీపై రివర్స్ కౌంటర్లు వేస్తుంది. కావాలనే చంద్రబాబు, లోకేష్‌లు దాడులు చేయించి, ఆ తప్పుని జగన్ మీద తోసేయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక బీజేపీ-జనసేనలు కూడా ఎక్కువగా వైసీపీ ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నాయి. అలాగే బీజేపీ రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణకు ఉద్యమం చేయడానికి సిద్ధమవుతుంది.

అయితే ఇటీవల రామతీర్ధం ఘటన సమయంలో బీజేపీ నేతలు బాగా హడావిడి చేశారు. పోలీసులు పర్మిషన్ లేదని చెప్పిన, అక్కడకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహ, పలువురు నేతలనీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, సోముల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని, సోము వీర్రాజు రాష్ట్ర హోమ్ మంత్రిని టార్గెట్ చేశారు. జగన్ కేబినె‌ట్‌లో హోంమంత్రి సుచరిత కీలుబొమ్మలా మారారని ఎద్దేవా చేశారు.

అయితే హోమ్ మంత్రి సుచరితని టీడీపీ మొదట నుంచి టార్గెట్ చేస్తూ వస్తుంది. అసలు హోమ్ మంత్రి డమ్మీ అని మాట్లాడుతున్నారు. అలాగే హోమ్ శాఖ బాధ్యతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అయితే హోమ్ మంత్రి సుచరిత మీద ఇన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో, నెక్స్ట్ టర్మ్‌లో ఆమె పదవి డౌట్ అని టీడీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. వచ్చే మంత్రివర్గ విస్తరణలో జగన్, సుచరితకు మరో ఛాన్స్ ఇవ్వకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: