కాళ్ల‌కు చెప్పుల్లేవు స‌ర్ మీరే ఆదుకోవాలి.. క‌డుపు నిండా అన్నం లేదు మీరు ద‌య చేసి మా పొట్ట నింపాలి.. అయ్యో ! నా భ‌ర్త చ‌నిపోయాడు మీలో ఎవ్వ‌ర‌యినా సాయం చేయండి ద‌హ‌న సంస్కారాలు కూడా చేయ‌లేని స్థితి నాది..ఇలాంటివెన్నో విన్నాం. క‌దిలిపోయాం.. క‌రిగిపోయాం.. మ‌ళ్లీ ఇప్పుడు లాక్డౌన్ మ‌న జీవితాల‌ను అత‌లాకుత‌లం చేసేందుకు సిద్ధం అయితే చిన్నా చిత‌కా ఉద్యోగులు ఏమైపోతారు.. ప్ర‌యివేటు బ‌డి పంతుళ్లు ఏమ‌యిపోతారు? హ‌మాలీలంతా ఏమ‌యిపోతారు? ఎవ‌రు ఎవ‌రితో అయినా యుద్ధం చేయొచ్చు కానీ దేశం యావ‌త్తూ ఐక్య‌మయి క‌రోనాతో చేసే యుద్ధ‌మే ఇప్పుడిక ముఖ్యం. ఆ దిశ‌గా అడుగులు వేసేట‌ప్పుడు జాగ్ర‌త్త చ‌ర్య‌లు త‌ప్ప‌వు అని నాయ‌కులు గుర్తు పెట్టుకుంటే మేలు. లేదంటే ఆక‌లి చావులు త‌ప్ప‌వు.


మ‌ళ్లీ లాక్డౌన్ పెడితే.. ఒక‌వేళ సంబంధిత నిబంధ‌న‌లు అమ‌లు అయితే కేంద్రం నుంచి అటువంటి ఉత్త‌ర్వులే వ‌స్తే అప్పుడు మ‌న దేశ ప్ర‌జ‌లు ఏమౌతారు? ఆ రోజు తిండికి లేక అల్ల‌ల్లాడిన వ‌ల‌స కార్మికుల క‌ష్టాల‌ను మ‌నం మ‌రువ‌లేం. ఆ రోజు చంటి బిడ్డ‌ల‌తో వేలకు వేల మైళ్ల ప్ర‌యాణాన్నీ మ‌రిచిపోలేం. ఆ రోజు దార్లోనే ప్రాణాలు విడిచిన క‌ష్ట‌జీవుల దుఃఖాన్నీ మ‌రువ‌లేం. అత్యంత అనాలోచితంగా లాక్డౌన్ ను విధించి ఏ ముంద‌స్తు ఏర్పాట్లూ చేయ‌కుండా  ఎంద‌రో అభాగ్యుల‌ను అన్నం పెట్ట కుండా మాడ్చి చంపిన పాపం కూడా ప్ర‌భుత్వాల‌దే! ఆఖ‌రికి ఆ రోజు ప్ర‌జ‌లే అంతా ఒక్క‌ట‌య్యారు. తిండి లేని వారికి తిండి అందించారు. గుక్కెడు నీరు అందించి దాహార్తి తీర్చారు.  చాలా చోట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆదుకుని నిలువ నీడ నిచ్చి ఆ వ‌ల‌స కార్మికుల‌కు ఆత్మ బంధువులు అయ్యారు. మ‌ళ్లీ లాక్డౌన్ పెడితే?

ఇదే భ‌యం అంద‌రిలోనూ నెల‌కొని ఉంది. వ్యాపారాలు పోతాయి. వేల కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ నిలిచిపోతోంది. విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ‌తాయి. చ‌దువులు ఆన్లైన్ పేరిట సాగినా అవేవీ విద్యార్థి ప్ర‌తిభ‌లోనో వికాసంలోనో ఎటువంటి మార్పూ తీసుకురావు. ఎక్క‌డికక్క‌డ ప‌నులు నిలిచిపోతాయి. ఇంట్లో ఉంటూ ఉంటే తిన‌డానికి తిండి ఉన్నా స‌రే మ‌నో వ్య‌థ పెరిగిపోతుంది. కొన్ని చోట్ల గృహ హింస పెరిగిపోతుంది. అన్నీ ఉన్న వాళ్ల ఇంట్లో బోర్ అన్న ప‌దం విన‌ప‌డుతుంది స‌రే మ‌రి ఏమీ లేని వారింట్లో ఏం జ‌ర‌గ‌నుంది. పాపం! బిడ్డ‌ల ఆక‌లి తీర్చ‌లేని త‌ల్లిదండ్రులు ప‌స్తుల‌తో ఉంచ‌లేక క‌న్నీటి ప‌ర్యంతం అవుతారు. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని కుటుంబాలు ఆత్మ న్యూన‌తలో ఉండిపోతాయి. ప‌నుల్లేక డ‌బ్బుల్లేక చాలీ చాల‌నీ తిండితో బ‌తుకు ఈడ్చే కుటుంబాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే బియ్యం గింజ‌లు ఏ పాటి స‌రిపోతాయ‌ని?



లాక్డౌన్ కార‌ణంగా జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతాయి. అవును నిరుద్యోగం పెరిగిపోతుంది. ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి. ఏం జ‌రిగినా జ‌ర‌గ‌కున్నా నేతాశ్రీ‌ల‌కు ఇవేవీ కంటికి ఆన‌వు క‌నుక ఈ లాక్డౌన్ అన్న‌ది పేద‌వాడి గుండె దిగులు పెంచేదే.. అలా చేయ‌కుండా ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెత‌కాలి. కార్మికుల ఉపాధిని దూరం చేయ‌కూడ‌దు. ఎంత క‌ష్టం వ‌చ్చినా స‌రే ఉత్ప‌త్తి రంగాల‌ను నిలుపుద‌ల  చేయ‌కూడ‌దు. త‌గు జాగ్ర‌త్త‌ల‌తోనే ప‌రిశ్ర‌మ‌లను న‌డిపించాలి. కొన్ని చోట్ల లాక్డౌన్ త‌ప్ప‌ద‌నుకుంటే ముందే స‌మాచారం ఇచ్చి సంబంధిత వ‌ర్గాల‌కు ఏ ఇబ్బందీ లేకుండా చేయాలి. ఇవేవీ చేయ‌కుండా లాక్డౌన్ అంటే అదొక ప్ర‌మాద‌కారి. అదొక విష తుల్యం అయిన నిర్ణ‌యం. ఇంకా చెప్పాలంటే అదొక ప్రాణాంత‌కి.

మరింత సమాచారం తెలుసుకోండి: