రాజకీయ చదరంగంలో ఎత్తులు ఎవరు వేస్తారనే విషయం పైఆసక్తి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యర్థి వేసే ఎత్తులు కూడా ఆసక్తిని రేకెత్తిస్తాయి. కాక పోతే మొదటి ఎత్తు ఎవరు ఎలా వేశారన్న విషయమే ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో  ఉన్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ,  భారతీయ జనతా పార్టీ రెండూ కూడా తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి పాకులాడుతున్నాయి. ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి వెళ్లెందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముందు వరకూ కూడా అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి అశావహంగా లేదని ఆ పార్టీ సీనియర్ నేతలు పేర్కోంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా,  ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకో లేక వెనుకంజ పడిపోయింది  కాంగ్రెస్ పార్టీ.  ఏదో ఒకటి చేయాలని,  పార్టీలో మునుపటి ఉత్సాహం, ఉత్తేజం తీసుకు రావాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కొద్ది మాసాల క్రిందట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ్ని కూడా మార్చింది. స్వతహాగా దూకుడు స్వభావం, వాగ్దాటితో జనవాహినిని ఆకర్షించ గల నేతగా పేరుతెచ్చుకున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పింది.
భారతీయ జనతా పార్టీ కేంద్రం లో అధికారం లో ఉండటంతో ,  ఇటు తెలంగాణ లోనూ  అతి త్వరలోనే అధికార పగ్గాలు చేపట్టాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన  కిషన్ రెడ్డి కేంద్రంలోఅమాత్యుడిగా ఉన్నారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు బండి సంజయ్ చేతుల్లో ఉన్నాయి. ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ నిత్యం క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది బిజేపి. ఇటీవల జరిగిన హుజూరాబాద్ నియోజక వర్గం లో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించుకుంది కూడా. అయితే ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును గాని ధీటుగా ఎదుర్కోనే స్థితిలోలేవు.

కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆది నుంచి దూకుడు గానే ఉంది. యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో ఆయన నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుపై విమర్శల వర్షం కురిపించారు.  నిజంగా తెలంగాణ రైతులపై  ప్రేమ ఉంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పక్షానికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి సవాళ్లతోనే సరిపెడతారా లేక క్షేత్ర స్థాయి పోరులో కడవరకూ సాగుతారా ? అన్నదే ప్రస్తుతం  తలెత్తుతున్న ప్రశ్న.



మరింత సమాచారం తెలుసుకోండి: