గత కొద్ది రోజుల క్రితం వచ్చిన రెండు తుఫాన్లు తెలుగు రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించాయి. గతంలో లేని విధంగా ఈసారి వర్షాలు బీభత్సంగా కురవడంతో అందరికీ నష్టాలు వాటిల్లాయి. ముఖ్యంగా చాలా మంది రైతన్నలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయారు. దాదాపు నెల రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు కారణంగా ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు, రాయల సీమ ప్రాంతాలలో హైవేలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో ప్రయాణికులను మళ్లించి రోడ్లను మరమ్మత్తు చేశారు. దీని కారణంగా అటు ప్రయాణికులకు ఇటు ప్రభుత్వాలకు కూడా సమయం మరియు డబ్బు వృదా అయ్యాయి.

ఎక్కడిక్కడ వంతెనలు తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు ప్రజలకు ఈ వర్షాలకు పని దొరక్క అల్లాడిపోయారు. తిండి లేక, నిలువ నీడ లేక నరకాన్ని చవిచూశారు. ఈ భారీ వరదల కారణంగా ఎందరో నివాసాలు కూలిపోయి రోడ్డున పడ్డారు. ఇక రైతన్నల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. కొన్ని ప్రాంతాలలో విత్తనాలు వేయగా, మొలకలు వచ్చి రైతు హమ్మయ్య అనుకునే లోపు వరుస వర్షాల వలన పొలాలు నీటితో నిండిపోవడంతో ఆ మొలకలు కాస్త నీట మునిగి పడిపోయాయి. మళ్ళీ రైతన్నకు అంతకంతకూ శ్రమ, మరియు పెట్టుబడి నష్టం అయ్యింది.

మరికొన్ని ప్రాంతాల్లో  చేతికి అందాల్సిన పంట వరదల దాటికి కొట్టుకు పోయింది. ఇంకొన్ని ప్రాంతాల్లో కోతకు సిద్ధమైన పంట ముంచెత్తిన వరుస తుఫాన్ల కారణంగా కళ్లముందే చల్లా చెదురైపోయి రైతున్నల జీవితాలను అతలాకుతలం చేశాయి. ప్రకృతి మానవునిపై కన్నెర్ర చేసినట్లుగా వరుస వైఫరీత్యాలు ప్రజలను అన్నివిధాలుగా ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి. మరి వచ్చే సంవత్సరం అయినా అన్ని విధాలుగా ప్రజలు సుభిక్షముగా ఉండాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: