రాజ‌కీయాల్లో నోరు మాత్ర‌మే ఎప్పుడూ ప‌నిచేయ‌దు. పైగా అంద‌రికీ నోరు కూడా ఉండ‌దు. నోరున్నంత మాత్రాన అంద‌రూ గెలిచేస్తార‌ని కూడా చెప్ప‌లేం. అయితే.. ఒక్కొక్క‌సారి స‌రైన ఈక్వేష‌న్లు కుద‌ర‌క .. పిల్లి కూడా పులి మాదిరిగా ప్రచారంలోకి వ‌చ్చేస్తుంది.. త‌న స‌త్తా ఇంత‌.. అంత‌.. అని జ‌బ్బ‌లు చ‌రుచుకుం టుంది. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి ఇలానే ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. 20 ఏళ్లుగా నియోజ‌క‌వ‌ర్గాన్ని పాలిస్తున్న నాని విష‌యంలో ఎటు చూసినా.. బ‌లుపు కాదు.. వాపేన‌ని చెబుతున్నారు.

20 వేలు దాట‌ని మెజారిటీ?
గుడివాడ నా అడ్డా అని చెప్పుకొని.. మీసం మెలేసే నానికి ఇన్నేళ్లుగా కాలం క‌లిసి రావ‌డం కాదు.. ప్ర‌త్య ర్థుల ఈక్వేష‌న్ క‌లిసిరాక పోవ‌డంతోనే నెట్టుకొచ్చారనేది నిర్వివాదాంశం. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న నాలుగు ఎన్నికల్లో విజ‌య‌మైతే సాధించారు. కానీ, ప్ర‌జ‌ల మ‌న‌సులు మాత్రం గెలుచుకోలేక పోయారు. ఇదే జ‌రిగి ఉంటే.. ఎన్నిక ఏక‌పక్షంగా సాగిపోయేది. పోనీ.. క‌నీసంలో క‌నీసం 20 వేల ఓట్ల మెజారిటీ అయినా త‌గ్గి ఉండేది. కానీ, అలా ఎప్పుడూ జ‌ర‌గేలేదు.

దీనికి కారణం.. నానిపై వ్య‌తిరేక‌తే. కానీ, ప్ర‌త్యామ్నాయంగా బ‌ల‌మైన నాయ‌కుడు గుడివాడ ప్ర‌జ‌ల‌కు ల‌బించ‌లేదు. అంతేకాదు.. ప్ర‌త్య‌ర్థి కూట‌మిలోనూ బ‌ల‌మైన ఈక్వేష‌న్ క‌నిపించలేదు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. గుడివాడ‌లో దిమ్మతిరిగే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు టీడీపీ నాయ‌కుడు, ఎన్నారై నేత వెనిగండ్ల రాము. రాజ‌కీయాల్లోకి ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదన్న‌య్యా! అనే డైలాగును ఆయ‌న చెప్ప‌క‌పోయినా.. అంత‌కు మించిన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

ఈ టికెట్‌ను ఆశించి కొంత నిరాశ‌కు గురైన రావి వెంక‌టేశ్వ‌రావుకు పెద్ద‌పీట వేశారు. టెక్నిక‌ల్‌గా టికెట్ రాముదే అయినా..అప్ర‌క‌టిత అభ్య‌ర్థిగా రావినే ఆయ‌న ముందు పెట్టారు. నిజానికి రావి చాలా బ‌ల‌మైన నాయ‌కుడు 2014లో గ‌ట్టి పోటీ ఇచ్చారు. కేవ‌లం నానిని 11 వేల ఓట్ల‌కే క‌ట్ట‌డి చేసి.. త‌న ఆధిప‌త్యాన్ని నిరూపించుకున్నా.. ఈక్వేష‌న్‌బ‌లంగా లేక‌పోవ‌డంతో ఓడిపోయారు. దీనిని ప‌సిగ‌ట్టిన రాము.. రావినే ముందు పెట్టారు. క‌లివిడిగా-ఉమ్మ‌డిగా ప్ర‌చారానికి ముందుకు సాగుతున్నారు.

దీంతో గుడివాడ అడ్డాలో ఇప్పుడు స‌రికొత్త ఈక్వేష‌న్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇద్ద‌రు బ‌ల‌మైన నాయ‌కులు క‌లిసి.. ఒకే తానులో ముక్క‌ల్లా ప్ర‌చారాన్ని తార‌స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఎక్క‌డా విభేదాలు లేవు.. ఎక్క‌డా చిన్న పొర‌పొచ్చాలు కూడా చూద్దామ‌న్నారావ‌డం లేదు. క‌లిసి క‌ట్టుగాప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతున్నా రు. ఫ‌లితంగా గుడివాడ ప్ర‌జ‌లు గుండెల‌పై చేయివేసుకుని ఊపిరి పీల్చుకునే నాయ‌కుడిగా రాము ముందంజ‌లో ఉన్నారు. ఎన్నిక‌లు కేవ‌లం టెక్నిక‌ల్ అంశంగానే మారాయి.. గెలుపు ఎప్పుడో నిర్ణ‌యం అయిపోయింద‌నే రేంజ్లో రాము పేరు మార్మోగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: