ఇంకేముంది ఇలాంటి ఉచిత పథకాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ ఉంటారు. కనీసం ఇలాంటి పథకాలు అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపుతాయి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. పథకాల అమలు కోసం కేంద్రం నుంచి లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం చేసి ఏకంగా తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలపైనే పన్నుల భారం మోపడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అను విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం నుంచి ఇదే జరుగుతుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలా ఉచిత పథకాల పేరుతో లక్షల కోట్ల అప్పు చేశారు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ కారణంగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది అంటూ ఆరోపించారు.
కానీ మొన్న ఎన్నికల్లో జగన్ అమలు చేసిన పథకాలతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంలోనే ప్రజలకు ఉచిత పథకాల ద్వారా నగదు పంచుతాం అంటూ హామీ ఇచ్చారు చంద్రబాబు. అయితే జగన్ పథకాలతో అప్పులు అయ్యాయి అనే విమర్శించిన చంద్రబాబు.. ఇక తాము అమలు చేసే పథకాలతోనూ మరింత అప్పులు పెరిగిపోతాయి అన్న విషయాన్ని మరిచిపోయారు. అయితే తెలంగాణలోనూ ఇదే జరిగింది. బిఆర్ఎస్ పాలనలో పథకాల ద్వారా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని.. అప్పులు పెరిగిపోయాయి అంటూ విమర్శించిన రేవంత్.. ఆరు గ్యారెంటీల పేరుతో అన్ని ఉచితం అంటూ చెప్పేశారు . ఇలాంటి ఉచిత పథకాలు ఇక రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేస్తాయని మాత్రం ఆలోచించలేదు. ఇలా ఏపీలో జగన్ పై చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ పై రేవంత్ అప్పులు చేశారని విమర్శలు చేశారు. కానీ తమ పథకాల ద్వారా కూడా అదే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం మరిచిపోయారు.