క‌రెంట్ బిల్లు క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని వైసీపీకి రాజీనామా చేశాడో మాజీ ఎమ్మెల్యే. కానీ రాజీనామా చేసిన బిల్లు మాత్రం క‌ట్టాల్సిందే అని అధికారులు షాకిచ్చారు. ఇంత‌కీ ఆ మాజీ ఎమ్మెల్యే మ‌రెవ‌రో కాదు మ‌ద్దాలి గిరిధర్ రావు. టీడీపీలో త‌న పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించిన మ‌ద్దాలి గిరి.. 2014లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మళ్ళీ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఈసారి మాత్రం గెలిచారు.


అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో.. నాడు టీడీపీని వీడి ఫ్యాన్ పార్టీలోకి దూకేశారు. వైసీపీలో చేర‌డం వ‌ల్ల మ‌ద్దాలి గిరికి రాజ‌కీయంగా ఒరిగిందేమి లేదు. క‌నీసం గ‌త ఎన్నిక‌ల్లో సీటు కూడా ద‌క్క‌లేదు. అయితే ఈయ‌న‌కు రెండు స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఆ మిల్లుల విద్యుత్ బకాయిలు రూ.43.5 కోట్లకు చేరింది. విద్యుత్ శాఖ అధికారులు ఆ బ‌కాయిల వ‌సూళ్ల‌కు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా.. వైసీపీ హ‌యాంలో గిరి బాగానే తప్పించుకోలిగారు. ప్ర‌భుత్వం నుంచి వాయిదాల ప‌ద్ధ‌తిలో బకాయిలు చ‌ల్లించేలా గిరి ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు తెచ్చుకున్నారు. పోని అలాగైన క‌ట్టారా అంటే అదీ లేదు.


వైసీపీ ప్ర‌భుత్వం కూడా గిరి విష‌యంలో చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేసింది. అయితే గ‌త ఏడాది ప్ర‌భుత్వం మారింది. వైకాపా పాల‌న‌లో గిరి ద‌గ్గ‌ర నుండి  విద్యుత్ బ‌కాయిలు వ‌సూల్ చేయ‌లేక‌పోయిన అధికారులు.. కూట‌మి ప్ర‌భుత్వంలో దూకుడుగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇప్ప‌టికే చేబ్రోలు ప‌రిధిలో ఉన్న గిరి స్పిన్నింగ్ మిల్లుల‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. బిల్లులు ఆపేశారు. ఆయ‌న గిరి నుండి ఎటువంటి రియాక్ష‌న్ లేదు. పైగా ప్రభుత్వం మారగానే బ‌కాయిలు ఎగ్గొట్టేందుకు గిరి తెలివిగా టీడీపీతో టచ్ లోకి వెళ్లారు.


కానీ, సైకిల్ పార్టీ గేటు దగ్గరకు కూడా రానివ్వకపోవడంతో.. వైసీపీకి రాజీనామా చేసి గిరి సైలెంటుగా ఉన్నారు. ఇలాగైనా కరెంట్ బిల్లు అడగరేమో అని ఆయ‌న భావించారు. అయితే అధికారులు అస్స‌లు ఊరుకోవ‌డం లేదు. మిల్లుల విద్యుత్ బకాయిలు కట్టకపోవడంతో ఆయ‌న‌ ఆస్తులు జప్తు చేసేందుకు సైతం సిద్ధం అవుతున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా గిరి క‌రెంట్ బిల్లు క‌డ‌తారా? లేదా? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: