ప్రపంచ దేశాలు ఎక్కడైతే ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ అభివృద్ధిలో బిజీగా ఉన్నాయి, అక్కడ తూర్పు పసిఫిక్‌లో ఉన్న ఓ చిన్న దేశం – తువాలు మాత్రం తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకు పోరాడుతోంది! జనాభా కేవలం 11 వేలమందికి మించని ఈ దేశం ప్రస్తుతం సముద్ర మట్టానికి అత్యంత దగ్గరగా ఉంది – కేవలం 2 మీటర్ల ఎత్తు మాత్రమే. ఇదే ఇప్పుడు తువాలుకు శాపంగా మారింది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సముద్ర మట్టం వేగంగా పెరుగుతూ, ఈ చిన్న దేశాన్ని మింగివేయబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. nasa అంచనా ప్రకారం సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశముంది. దీని ప్రభావం తువాలుపై ఇప్పటి నుంచే కనిపిస్తోంది. మంచినీటి వనరులు లవణమైపోతున్నాయి, నేలలూ సముద్రపు నీటి వల్ల ఉప్పుగా మారిపోతున్నాయి.
 

ఫలితంగా స్థానిక జీవనాధారాలు అయిన చేపలు, కొబ్బరి తోటలు నష్టపోతున్నాయి. ఈ పరిణామం మానవ తప్పిదాల వల్లే సంభవించింది. భూతాపం, పట్టణీకరణ, వనరుల దుర్వినియోగం దీనికి ప్రధాన కారణాలు అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన తువాలు ప్రభుత్వం, తమ ప్రజలను రక్షించేందుకు ఫాలేపిలీ యూనియన్ ఒప్పందం పేరుతో ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తువాలు ప్రజలకు ఆస్ట్రేలియాలో విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే దాదాపు 8,750 మంది తువాలు ప్రజలు ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. వీరికి లాటరీ విధానంలో వీసాలు మంజూరయ్యాయి.


ఈ కథలో దాగిన సత్యం మనందరినీ చెలించాల్సిందె. తువాలు ఇచ్చే హెచ్చరిక స్పష్టంగా ఉంది – “ఇంకా సమయం ఉంది! పర్యావరణాన్ని కాపాడుకోండి. లేకపోతే మేము మాయం అయినట్టు, మీరు కూడా మాయం కావచ్చు!” తువాలుతో పాటు బంగ్లాదేశ్, మాల్దీవులు, ఫిజీ దేశాలు కూడా ప్రమాదానికి లోనయ్యే పరిస్థితిలో ఉన్నాయి.ఒక గ్రామం కాదు, ఒక జిల్లాకూడా కాదు – ఓ సంపూర్ణ దేశం సముద్రంలో మాయమవుతుంటే, మనం ఇప్పటికీ గట్టిగా స్పందించకపోతే ఇది మానవాళికి సంకెతమే అవుతుంది. తువాలు అనుభవం మన భవిష్యత్‌కు అద్దం వేసింది. ఇప్పుడు మారకపోతే రేపటి ప్రపంచమే ప్రశ్నార్థకం. తువాలు నేడు… మనమే రేపా?

మరింత సమాచారం తెలుసుకోండి: