రాజకీయాల్లో నేతల స్వభావం, పని తీరు ఒక్కోకరికి ఒక్కోలా ఉంటుంది. వైసీపీనా, టీడీపీనా లేదా కూటమీనా… ఎవరి వ్యక్తిగత పంథా వారిది వేరు. ఎన్నికల సమయంలో టికెట్ కోసం తపన, గెలిచాక ప్రజలకు చేరువ కావడంలో ఉత్సాహం - ఇవన్నీ కొందరిలో ఉండగా, చాలామందిలో మాత్రం ఆ తపన కనిపించదు. పదవి రాకపోవడం, గుర్తింపు లభించకపోవడం, లేదా నిర్వేదం - ఇలా విభిన్న కారణాలతో చాలామంది ఎమ్మెల్యేలు రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఇక, కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంకో లెవెల్‌కి వెళ్లిపోయింది. అక్కడ “సెకండ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్” అనే కొత్త శక్తి కేంద్రం ఏర్పడింది. అంటే, గెలిచిన ఎమ్మెల్యే కంటే పరోక్షంగా ఎక్కువ పవర్ కలిగిన నేతలు అక్కడ కుర్చీ ఆక్రమించారు. ఇది కొత్త విషయం కాదు.


గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, పనితీరుపై అసంతృప్తితో లేదా ఆరోపణల నేపథ్యంలో, అధినేత మరో నేత చేత పగ్గాలు పట్టించే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి సెంటర్లు 22 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని ఎస్సీ, రెండు ఎస్టీ సీట్లు, ఇంకా పది కంటే ఎక్కువ జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎంపీల పాత్ర గట్టిగానే ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో విభేదాలున్న ఎంపీలు తమకు అనుకూల నేతలను సిఫారసు చేస్తే, చంద్రబాబు కూడా ఎక్కువ ఆలోచించకుండా ఆ సిఫారసులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని టాక్. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అసలు ప్రజా ప్రతినిధుల కంటే “సెకండ్ సెంటర్” నేతలే చక్రం తిప్పే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు, కర్నూలు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పక్కనపడి, ఈ కొత్త కేంద్ర నేతలే అన్ని పనులు ముందుకు నడుపుతున్నారు.


 తిరుపతిలో కూడా ఇదే సీన్. తాజాగా, కొన్ని యువ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఈ సెంటర్లు ఏర్పడటంతో, అసలు అధికార సమీకరణాలే మారిపోతున్నాయి. పార్టీ లోపల ఈ వ్యవహారంపై పెద్ద చర్చ నడుస్తోంది. సీనియర్లు ఈ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “గెలిచిన ఎమ్మెల్యేలు సైడ్ లైన్ అవ్వడం, కొత్త కేంద్రాలు పుట్టుకొచ్చే పరిస్థితి రావడం - ఇది పార్టీకి దీర్ఘకాలంలో నష్టం చేస్తుంది” అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద, ప్రజలు ఓటు వేసి గెలిపించిన నేతలకంటే, పరోక్షంగా నియమితులైన నేతలే నిర్ణయాలు తీసుకునే సిస్టమ్‌ పార్టీ భవిష్యత్తుకు ఎంత మేలు చేస్తుందో అనుమానం వ్యక్తమవుతోంది. కానీ, ప్రస్తుతం మాత్రం ఈ “సెకండ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్లు” కొన్ని నియోజకవర్గాల్లో అసలు శక్తి కేంద్రాలుగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: