విశాఖపట్నం రాజకీయాలు ఇటీవలికాలంలో కూట‌మి అధీనంలోకి వచ్చిన తర్వాత కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్‌ను కూట‌మి కైవసం చేసుకున్న నాటి నుండి, నగర రాజకీయ పరిస్థితులపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విశాఖ పర్యటనలో ఆయన నగర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, పార్టీ అంతర్గత విషయాలపై, స్థానిక నేతల మధ్య నెలకొన్న వాతావరణంపై కూడా విస్తృతంగా చర్చించారు. చంద్రబాబు డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొని అనంతరం పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ముఖ్యంగా వైసీపీ ప్రభావం విశాఖలో ఇంకా మిగిలి ఉందా లేదా, ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవడానికి ఆరా తీశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


పైకి చూస్తే విశాఖలో కూట‌మి బలంగా ఉన్నట్టే కనిపిస్తున్నా, అంతర్గతంగా నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తపై గతంలో టీడీపీ, జనసేన కలిసి తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆయనపై భూముల అక్రమాలు, అన్యాయ వ్యాపారాలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. అదే పారిశ్రామికవేత్తపై ఇప్పుడిప్పుడు టీడీపీ నేతలలోనే రెండు వర్గాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక వర్గం ఆయనకు మద్దతుగా నిలవగా, మరొక వర్గం మాత్రం కఠినంగా వ్యతిరేకిస్తోంది. ఈ విభేదాల వల్ల స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తత పెరుగుతుండగా, చంద్రబాబు దీనిని సీరియస్‌గా గమనించారు. ఈ విభేదాలు పార్టీ బలాన్ని దెబ్బతీయవచ్చని ఆయన భావించారని చెబుతున్నారు.


వైసీపీ నాయ‌కులు మాత్రం ఈ మధ్యకాలంలో విశాఖలో పెద్దగా కనిపించడం లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు సైలెంట్‌గా ఉండటం గమనార్హం. కూట‌మిని ప్రత్యక్షంగా సవాలు చేసే పరిస్థితి కనిపించకపోవడం, విశాఖలో పాలకపక్షం బలంగా నిలిచేలా చేస్తోంది. అయినప్పటికీ, పార్టీ లోపల విభేదాలు పెరగడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే "అంతా బాగానే ఉందా?" అని ఆయన నేతలతో నేరుగా ప్రశ్నించారని సమాచారం. నాయకులు మాత్రం అన్ని నియంత్రణలోనే ఉన్నాయని చంద్రబాబుకు హామీ ఇచ్చినప్పటికీ, ఈ విభేదాలు భవిష్యత్‌లో ఎలా మారతాయన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి, విశాఖలో ప్రస్తుతం బయటకు కనిపించేది కూటమి ఆధిపత్యమే అయినప్పటికీ, లోపల మంటలు మసులుతున్నాయి. ఈ మంటలు పెద్ద అగ్నిగా మారకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ముందుగానే ఆరా తీశారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: