
శుక్రవారం అసెంబ్లీలో ప్లాస్టిక్ వినియోగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం అందరికీ నచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – "మన జీవితాల్లో ప్లాస్టిక్ అనేది ఒక భాగంగా మారిపోయింది. ప్లాస్టిక్‌ని ఎంత ఆపాలని చూసినా ఆపలేకపోతున్నాం. కానీ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాం. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేధించారు. క్రమశిక్షణతో అమలు అవుతున్న ఆ నిర్ణయం మిగతా చోట్ల కూడా అమలు కావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచే ఆ మార్పు ప్రారంభం కావాలి. ఎందుకంటే ఫ్లెక్సీల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ చిన్న ఫంక్షన్‌కి, ఏ చిన్న కార్యక్రమానికైనా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మనమే మానుకోవాలి. ఫ్లెక్సీల వాడకాన్ని తగ్గించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము.
అదే విధంగా సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించాము. అందుకే అక్కడ గాజు బాటిల్‌లలోనే నీరు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ లో భాగంగా పార్కుల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. బయోడిగ్రేడబుల్ తయారీ పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తున్నాం. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు అధికారికంగా ప్రకటిస్తాం. రాజకీయ పార్టీలు వేసే ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ బాటిల్ లి పర్యావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి చాలా టైం పడుతుంది. ఇది పశువుల కడుపులోనే కాకుండా పసికందుల రక్తంలో కూడా కలిసిపోతుందని ఆయన హెచ్చరించారు. “ప్లాస్టిక్ లేని పర్యావరణాన్ని చూడాలి. ప్లాస్టిక్ లేని జీవితం ఎంతో ఆరోగ్యకరం” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు అసెంబ్లీలో ఉన్నవారినే కాకుండా, టీవీలో చూసిన ప్రజలను కూడా బాగా ఇంప్రెస్ చేశాయి". జనాలు కూడా ఆయన మాటలను ట్రెండ్ చేస్తూ, “ప్లాస్టిక్‌ని ఎంత దూరం పెడితే అంత మంచిది” అని అభిప్రాయపడుతున్నారు..!