ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఒక ఆసక్తికర మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూట‌మికి వ్య‌తిరేకంగా పనిచేసే సంస్థాగత ప్రతిపక్షం లేకపోవడం వల్ల, ప్రజల్లో “ప్రతిపక్షం లేదు” అన్న భావన బలంగా నెలకొంది. కానీ మరోవైపు, ప్రజలే స్వయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిగా మారుతున్నారు. ఆ భావంలోనే ఇప్పుడు ఏపీలో “ప్రజా ప్రతిపక్షం” బలంగా అవతరించింది. ఇటీవలి తంబళ్లపల్లె ఘటన ఇందుకు ఉత్తమ ఉదాహరణ. అక్కడ నకిలీ మద్యం తయారీ ముఠా పట్టుబడింది. ఈ ముఠా వైసీపీ హయాంలోనే కార్యకలాపాలు ప్రారంభించి, ఎన్నికల ముందు టీడీపీలో చేరి పోటీ చేసిన వారిది. అంటే రాజకీయ రంగు మార్చుకున్నా, అవినీతి మాత్రం కొనసాగింది. అయితే ఈసారి ప్రజలు మౌనం వహించలేదు. సోషల్ మీడియా నుంచి మొద‌లు పెట్టి పైస్థాయి వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.


ఇది కేవలం ఒక్క ఘటన కాదు. ఉల్లి ధరలు, రైతుల ఇబ్బందులు, ఉద్యోగాల భర్తీ వంటి అనేక అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నప్పుడు ముందుగా ప్రశ్నించేది సాధారణ ప్రజలే. టీడీపీ సానుభూతిపరులు, సామాన్య ప్రజలు కలసి సోషల్ మీడియాలో, జన సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను బలంగా ఎదుర్కొంటున్నారు. ఇది పార్టీల ప్రతిపక్షం కాదుగానీ, ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా మారాయి. వైసీపీ మాత్రం చిన్న పిల్ల‌ల రాజ‌కీయం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. క‌నీసం ప్రెస్‌మీట్లు కూడా పెట్ట‌కుండా ప్రెస్‌నోట్లు జారీ చేస్తూ, ప్రజా సమస్యలపై కాకుండా తమ ఇమేజ్‌ కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టింది. కానీ ఇదే వైఖరి ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచుతోంది.


జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన పెట్టుకోవడం కూడా రాజకీయ ప్రదర్శనగానే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రజల సమస్యలపై ఆయనకు సూటి సమాధానం లేకపోవడం, వాస్తవ పరిస్థితులను అంచనా వేయకపోవడం ఆయన నాయకత్వంపై నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే ప్రభుత్వాన్ని క్రమంగా జవాబుదారీగా మారుస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్క సమస్య వెలుగులోకి వస్తే, వెంటనే ప్రజా ప్రతిస్పందన చెలరేగుతోంది. ప్రభుత్వం కూడా ఆ ఒత్తిడికి లోనై నిర్ణయాలు తీసుకుంటోంది. ఏదేమైనా ఏపీలో ప్ర‌తిప‌క్షం కంటే ప్ర‌జా ప్ర‌తిప‌క్ష‌మే ఇప్పుడు హైలెట్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: