రాష్ట్రంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా తాలిబాన్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం, రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, మత్స్యకారులకు మద్దతుగా ఆయన రాజయ్యపేట పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రికిరాత్రి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అప్పటికే రాజమండ్రికి చేరుకున్న రామచంద్రయాదవ్... రాజయ్యపేటకు బయలుదేరుతుండగా ఆయన బస చేసిన హోటల్ కు పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఆయన్ని బయటికి రానీయకుండా అడ్డుకున్నారు. అంతే కాకుండా అక్కడే ఉన్న బిసివై పార్టీ నేతలతోనూ పోలీసులు వాగ్వివాదానికి దిగారు. మీడియాను సైతం హోటల్ వద్దకు అనుమతించలేదు. చివరకు రామచంద్రయాదవ్ తన పర్యటనను వాయిదా వేసుకుంటున్నానని చెప్పినా వినకుండా పోలీసులు జులం ప్రదర్శించారు. తాను సమీపంలో ఉన్న ఆలయానికి వెళతానన్న పోలీసులు అందుకు అంగీకరించలేదు. బలవంతంగా రామచంద్రయాదవ్ ను హోటల్ గదిలోనే నిర్భందించే ప్రయత్నం చేశారు. రామచంద్రయాదవ్ సిఆర్పీఎఫ్ సిబ్బందిపైనా పోలీసులు జులుం ప్రదర్శించారు. సిఆర్పీఎఫ్ కమెండోపై దురుసుగా ప్రవర్తించారు. వారిని పక్కకు నెడుతూ నానా బీభత్సం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రామచంద్రయాదవ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన వాయిదా వేసుకున్నానని చెప్పినా హోటల్ గదిలో నుంచి ఎందుకు బయటికి రానివ్వరంటూ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరుపై రామచంద్రయాదవ్ అసహనం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.


పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ను పోలీసులు అడ్డుకున్న సందర్భంలో పోలీసులు పరిధి వాటి ప్రవర్తించారు. అక్కడున్న వారిని పక్కకు లాగి పడేసేందుకు ప్రయత్నించారు. రామచంద్రయాదవ్ ను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు రామచంద్రయాదవ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రతిఘటించారు. అడ్డుగా ఉన్న సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిపైనా పోలీసులు జులం ప్రదర్శించారు. పోలీసుల తీరుపై రామచంద్రయాదవ్ అసహనం వ్యక్తం చేశారు. తాను రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తన పర్యటనను వాయిదా వేసుకుంటే... పోలీసులు మాత్రం రాజ్యాంగాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఒక్క సెంట్ భూమి కూడా తీసుకోలేరు
బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పేరుతో ప్రభుత్వం మత్స్యకారులు, రైతుల భూములను లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాలను బిసివై పార్టీ తిప్పి కొడుతుందని రామచంద్రయాదవ్ హెచ్చరించారు. రాజమండ్రిలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజయ్యపేటకు వెళుతున్న తనను అక్రమంగా నిర్భంధించేందుకు ప్రయత్నించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? అని ప్రశ్నించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు దోపిడీ దారులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులను, మత్స్యకారులను అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తాను అడుగు బయటపెడితే ఆంక్షలు పెడుతున్నారని, తాను వాస్తవాలు ఎక్కడ బయటపెడతానోనని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. కరేడు రైతులకు మద్దతుగా వెళితే అక్కడ కూడా అడ్డుకున్నారని, చివరకు న్యాయస్ధానం అనుమతితో వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఉదయగిరి మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఆ ప్రాంతానికి వెళుతుంటే పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారన్నారు. చివరకు రాజయ్యపేటకు కూడా వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే వారి గొంతులను నులిమేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై న్యాయ స్ధానంలో కేసులు వేస్తామన్నారు. అలాగే కోర్టు అనుమతితో త్వరలోనే రాజయ్యపేటకు వెళతానని తెలిపారు.


అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు
బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు వెళుతున్న తనను పోలీసులు నిర్భందించే ప్రయత్నం చేయడమే కాకుండా పాయకరావుపేట నియోజకవర్గంలో అనేక మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులతో పాటు ప్రజాసంఘాల నాయకులనూ అక్రమంగా నిర్భందించారన్నారు. వారందరినీ పోలీసులు భేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఒకవేళ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అక్రమ కేసులు పెట్టాలని చూస్తే కచ్చితంగా న్యాయస్ధానాల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలని పోలీసులకు సూచించారు. ప్రజా రక్షణకు పనిచేయాలని,  ప్రభుత్వానికి తొత్తులుగా మారవద్దని హితవు పలికారు.


కేంద్రం ద్రుష్టికి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేక ఉద్యమం
త్వరలోనే రాజయ్యపేటలో పర్యటిస్తానని బోడె రామచంద్రయాదవ్ హామీ ఇచ్చారు. అవసరం అయితే కేంద్రం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకువెళతానన్నారు. ప్రభుత్వానికి నిజంగా పెట్టుబడులు పెట్టి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఉంటే లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిలో కంపెనీలు ఏర్పాటు చేయాలన్నారు. అంతేగానీ రైతులు, మత్స్యకారులకు జీవనాధారంగా ఉన్న భూములను బలవంతంగా లాక్కొని పెత్తందార్లకు కట్టబెట్టడం కరెక్ట్ కాదన్నారు. పెట్టుబడి దారులతో లాలూచీ పడకుండా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర యువత ప్రయోజనాల కోసం పాటు పడాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా పాలన చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: