కాంగ్రెస్ పార్టీకి స్నేహితులను దూరం చేసుకుని చివరికి ఒంటరిగా మారడం కొత్తేమీ కాదు. గతంలో జాతీయ స్థాయిలో అనేక కూటములు కాంగ్రెస్ ధోరణి వల్లే విచ్ఛిన్న‌మ‌య్యాయి. ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడులోనూ కనబడుతోంది. డీఎంకేతో బలమైన మైత్రి బంధం కలిగిన కాంగ్రెస్, ఇటీవల కొన్ని చర్యలతో ఆ బంధాన్ని దెబ్బతీస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్‌తో కాంగ్రెస్ ప్రదర్శిస్తున్న సాఫ్ట్ కార్నర్ డీఎంకే నేతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. కరూర్ ఘటన తర్వాత రాహుల్ గాంధీ స్వయంగా విజయ్‌కి ఫోన్ చేశారన్న వార్తలతో డీఎంకే వర్గాలు కంగారుపడ్డాయి.  “ఒకవైపు విజయ్ మాపై రాజకీయంగా దాడి చేస్తుండగా, మరోవైపు ఆయనకు రాహుల్‌ పరామర్శగా ఫోన్ చేయడం అంటే మమ్మల్ని నిర్లక్ష్యం చేయడమే” అని డీఎంకే వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.


టీవీకే అధినేత విజయ్ రాజకీయంగా డీఎంకే - కాంగ్రెస్ కూటమిని ప్రత్యర్థులుగా ప్రకటించి, వారిపైనే దాడి చేస్తూ వస్తున్నారు. ఆయనకు బీజేపీపై విమర్శలు ఉన్నా ప్రధాన ఫోకస్ మాత్రం స్టాలిన్ కూటమిపైనే ఉందని తెలుస్తోంది. కరూర్ ఘటనలో ప్రజాభిప్రాయం తనవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్న విజయ్‌ను డీఎంకే వ్యూహాత్మకంగా కౌంటర్ చేయాలని చూస్తోంది. కానీ అదే సమయంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదా పరామర్శించడం కూటమి అంతర్గత సంబంధాలకు బీట‌లు వారేలా చేస్తోంది.


ఇక కాంగ్రెస్ ఈ వ్యూహం వెనుక ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్ల కోసం స్టాలిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు తీసుకుంటోందా? లేక నిజంగా విజయ్‌తో కొత్త రాజకీయ సమీకరణలు ప్రయత్నిస్తోందా? అన్న ప్రశ్నలు డీఎంకేలో గందరగోళాన్ని సృష్టించాయి. మొత్తానికి కాంగ్రెస్ మరోసారి మిత్రపక్షాల విశ్వాసాన్ని కోల్పోయే దారిలో నడుస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది. స్టాలిన్ గతంలోలా కాంగ్రెస్‌పై నిస్వార్థ మద్దతు చూపే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్, “ప్రతి రాష్ట్రంలో మిత్రులను కాకుండా ప్రత్యర్థులను సృష్టించే పార్టీగా” మారుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. తమిళనాడులో ఈ పరిణామం కూటమి రాజకీయాల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా..!

మరింత సమాచారం తెలుసుకోండి: