న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి మహిళా జర్నలిస్టు పూజామక్కర్ టీకా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆమెకు వైద్యులు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా వేశారు. సరిగ్గా టీకా వేయించుకున్న 20 గంటల తర్వాత ఆమె టీకా గురించి మాట్లాడారు. టీకా తీసుకున్న 20 గంటల తర్వాత కూడా తనలో ఎటువంటి మార్పులు రాలేదని, అంతా బాగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు.  భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ కరోనా టీకా సురక్షితమని పూజామక్కర్ సర్టిఫికెట్ ఇచ్చారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత దీని ప్రభావం గురించి ఆమెను ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా ఇప్పటివరకు ఏ సమస్య లేదని పూజా పేర్కొన్నారు.

కరోనా టీకా పూర్తిగా సురక్షితమని, దీని గురించి సామాన్య ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకే తాను టీకా వేయించుకున్నానని ఆమె అన్నారు. ఆమె టీకా గురించి ఏమన్నారో ఆమె మాటల్లోనే చూద్దాం. ‘‘నేను కరోనా టీకా తీసుకొని 20 గంటలు అయ్యింది. కోవాక్సిన్ టీకా తీసుకున్నాక కూడా నేను బాగున్నాను. ఎటువంటి మార్పులు రాలేదు. నేను సాధారణంగానే ఉన్నాను. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి పుకార్లను నమ్మవద్దని దేశ ప్రజలను కోరుతున్నాను.  భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా పూర్తిగా సురక్షితం. దీని గురించి చింతించాల్సిన పనిలేదు.

ఈ వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం ఉంచాలి అని నేను అందరిని కోరుకుంటున్నాను ”అని పూజా మక్కర్ తెలిపారు. కాగా.. కరోనా టీకా రెండు డోస్‌లుగా తీసుకోవాల్సి ఉంటుంది. పూజా మొదటి డోస్ ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి.. మరో డోస్‌ను 28 రోజుల తర్వాత పూజాకు వేస్తారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవాక్సిన్ 200 శాతం సురక్షితమని ఈ సందర్భంగా కంపెనీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: