నర్సుల సేవలను గౌరవించేందుకు ప్రతి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుతారు. మోడర్న్ నర్సింగ్ వ్యవస్థాపకురాలు అయిన ఫ్లొరెన్స్ నైటింగేల్ 1820, మే 12న జన్మించగా ఆమె జయంతినే అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. 1953 నుంచి 1956 వరకు జరిగిన క్రిమియా యుద్ధంలో 2,70,000–3,00,000 వరకు సైనికులు మరణించారు. అయితే ఈ యుద్ధంలో ఎన్నో లక్షల మంది సైనికులు గాయపడగా వారందరికీ వైద్య చికిత్స అందించేందుకు ఫ్లొరెన్స్ నైటింగేల్ నడుంబిగించారు. చాలామంది నర్సులకు మేనేజర్ గా ఉంటూ వారందరికీ సమర్థవంతమైన శిక్షణ ఇచ్చి సైనికులకు మెరుగైన వైద్యం అందేలా చేసి వారి ప్రాణాలను కాపాడారు. కటిక చీకటిలో కూడా దీపం పట్టుకుని సైనికులకు వైద్యం అందించిన ఫ్లొరెన్స్ నైటింగేల్ తనకే కాదు నర్సు వృత్తికి కూడా మంచి కీర్తి తెచ్చి పెట్టారు.


ఆ త్యాగమూర్తి కారణంగానే నర్సింగ్ స్కూల్ ఆవిర్భవించింది. ఆ తర్వాత ఎందరో మహిళలు నర్సు వృత్తిని ఎంచుకొని రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్యరంగంలో నర్సు పాత్ర ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆసుపత్రిలో జాయిన్ అయిన రోజు నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకూ ప్రతిక్షణం రోగులకు సహాయం చేస్తూనే ఉంటారు. ఈ సహనమూర్తులు రోగులను తమ సొంత కుటుంబీకులగా భావించి సరైన సమయంలో సరైన మందులు ఇస్తూ వారి ఆరోగ్యం కుదుటపడేందుకు సహాయ పడతారు.


ప్రస్తుత కరోనా కాలంలో కూడా వైద్య రంగానికి వెన్నెముకగా నిలుస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగుల ప్రాణాలను కాపాడుతూ అసలైన దేవతామూర్తులుగా పేరు తెచ్చుకుంటున్నారు. కరోనా రోగుల వెంటే ఉంటూ వారికి ఫ్లూయిడ్స్‌ అందించడం, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్‌ పెట్టడం వంటి సపర్యలు అహోరాత్రులు చేస్తున్నారు. నర్సులు లేని వైద్య రంగాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కావున వారి సేవలను గుర్తిస్తూ వారికి కృతజ్ఞతలు తెలపడం మనందరి బాధ్యత.



ఇకపోతే ఇంటర్నేషనల్ నర్సెస్ కౌన్సిల్ 1965 లో మొదటిసారిగా నర్సుల దినోత్సవం జరుపుకుంది. 1953లో అమెరికా ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖ అధికారి డోరతీ సదర్లాండ్.. అప్పటి అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసన్‌హోవర్‌కు "నర్సుల దినోత్సవాన్ని" ప్రకటించాలని ప్రతిపాదించారు. కానీ ఐసన్‌హోవర్‌ ఆమె ప్రతిపాదనకు ఆమోదం తెలుపలేదు. చివరికి నర్సు వృత్తికి శ్రీకారం చుట్టిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి రోజున అనగా మే 12ను 1974 లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించి ప్రతి ఏటా జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: